టీచర్ ఎమ్మెల్సీలుగా రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల ఓటమి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దిశగా జీవన్‌రెడ్డి
రెండు రౌండ్లు ముగిసేసరికి సగానికి పైగా ఓట్లతోముందంజ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/నల్లగొండ: కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఆయా స్థానాల్లో కూర రఘోత్తంరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. అలాగే కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి చాలా వెనకబడి ఉన్నారు. ఈ స్థానంలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆయనకు సమీపంలో ఏ పార్టీ కూడా లేకపోవడం గమనార్హం. పోలైన మొత్తం ఓట్లలో రెండు రౌండ్లు ముగిసే సరికి సగానికి పైగా జీవన్‌రెడ్డికి పోలయ్యాయి.
ఇక్కడ అధికార టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో బరిలోకి మిగతా 2వ పేజీలో దిగిన గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ద్వితీయ స్థానానికి పరిమితమయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావు.. గౌడ్‌తో పోలిస్తే స్వల్ప ఓట్ల తేడాతో మూడో స్థానంలో నిలిచారు. మంగళ వారం రాత్రి 11.30 గంటలకు మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి జీవన్‌రెడ్డి 21,364 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ 5,856 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావు 5,657 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. రాణి రుద్రమ 1,952 ఓట్లు, జి.రణజిత్‌మోహన్‌కు 2,041 ఓట్లు సాధించగలిగారు.
ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో రఘోత్తంరెడ్డి
కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఓట్ల లెక్కింపు 11 గంటలకు పూర్తయింది. ఈ స్థానానికి జరిగిన పోరులో పీఆర్‌టీయూ బలపరిచిన కూర రఘోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భట్టారపు మోహన్‌రెడ్డి మధ్య మూడు రౌండ్ల వరకు ఉత్కంఠ నెలకొంది. ఒకటో రౌండ్‌లో రఘోత్తమరెడ్డికి 3,867 ఓట్లు రాగా, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డికి 3,257 ఓట్లు, టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డికి 1,682 ఓట్లు, కొండల్‌రెడ్డికి 1,790 ఓట్లు, మామిడి సుధాకర్‌రెడ్డికి 1,677 ఓట్లు, సీహెచ్.రాములుకు 1,294 ఓట్లు, వేణుగోపాలస్వామికి 116 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో రఘోత్తమరెడ్డికి 5,462 ఓట్లు, మోహన్‌రెడ్డికి 4,253 ఓట్లు, పాతూరి సుధాకర్‌రెడ్డికి 2,486 ఓట్లు, మామిడి సుధాకర్‌రెడ్డికి 2,631 ఓట్లు, కొండల్ రెడ్డికి 2,393 ఓట్లు, చిట్యాల రాములుకు 1,456 ఓట్లు వచ్చాయి. 3, 4, 5వ రౌండ్లలో వేణుగోపాలస్వామి, చిట్యాల రాములు, పాతూరి సుధాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి ఎలిమినేషన్ కాగా.. రఘోత్తమరెడ్డి, భట్టారపు మోహన్‌రెడ్డికి పోలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రఘోత్తమరెడ్డికి 7,505 ఓట్లు రాగా, మోహన్‌రెడ్డికి 5,798 ఓట్లు వచ్చాయి. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తమరెడ్డి ఎన్నికైనట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు.
వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం బలపర్చిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి పూల రవీందర్‌పై ఆయన 2,774 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 20,888 ఓట్లు ఉండగా 18,886 ఓట్లు పోలయ్యాయి. అందులో ఒక ఓటు పోలింగ్‌లో ఎటూ తేలకపోవడంతో 18,885 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించారు. వాటిలో 18,027 ఓట్లు చెల్లగా.. 858 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 50 శాతానికి మించి ఒక్క ఓటును గెలుపునకు కోటాగా నిర్ణయించారు. అంటే 9,014 ఓట్లు రావాలి. మూడో రౌండ్ సగం లెక్కించే సరికి మొదటి ప్రాధాన్యతా ఓట్లు లెక్కింపు పూర్తయింది. అప్పటికి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 8,976 ఓట్లు రాగా, పూల రవీందర్‌కు 6,279 ఓట్లు వచ్చాయి. అయితే గెలుపునకు ఇంకా 38 ఓట్ల తేడా ఉంది. దీంతో అతి తక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థుల ఓట్లు ఎలిమినేషన్ చేసి ఆ ఓట్లను లెక్కించారు. అప్పటికి కోటా సరిపోలేదు. దుర్గం సూరయ్య, పారుపల్లి సురేశ్ ఓట్లను లెక్కించడంతో నర్సిరెడ్డికి మొత్తం 9,021 ఓట్లు వచ్చాయి. దీంతో నర్సిరెడ్డి విజయం సాధించినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌవర్ ఉప్పల్ ప్రకటించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి