బీసీ బిల్లు పాసైతే మోదీ మరో అంబేడ్కర్‌ | R Krishnaiah BC Meeting in Hyderabad | Sakshi
Sakshi News home page

బీసీ బిల్లు పాసైతే మోదీ మరో అంబేడ్కర్‌

Jun 24 2019 7:49 AM | Updated on Jun 24 2019 7:49 AM

R Krishnaiah BC Meeting in Hyderabad - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

కాచిగూడ: పార్లమెంట్‌లో వైఎస్సార్‌ సీపీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లు పాసైతే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అంబేడ్కర్‌ అవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన బీసీ కులసంఘాల ప్రతినిధుల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ రాజకీయ పార్టీ చేయలేని పనిని వైఎస్సార్‌ సీపీ బీసీ బిల్లు పెట్టి బీసీల మన్ననలు పొందుతోందన్నారు. 30 ఏళ్ల తమ పోరాట ఫలితంగానే బీసీ బిల్లు పార్లమెంట్‌కు చేరిందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో 92 మంది బీసీ ఎంపీలున్నా ఏ ఒక్కరూ బీసీ బిల్లు పెట్టే ప్రయత్నం చేయలేదని, వైఎస్సార్‌ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్‌లో పెట్టి చరిత్ర సృష్టించారన్నారు.

ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన మాట నిలబెట్టుకుని అందరికీ ఆదర్శప్రాయులయ్యారని అభినందించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలందరూ అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, పార్లమెంట్‌ సభ్యులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీసీ బిల్లు పాస్‌కాకపోతే దేశాన్ని రణరంగంగా మారుస్తామని, రాష్ట్రాలను దిగ్బంధం చేస్తామని, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బిల్లు పాస్‌ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, లాలకోట వెంకటచారి, శ్రీనివాసులు, సంగమేశ్వర్, ఆర్‌.లక్ష్మణ్‌రావు, వేముల వెంకటేష్, మదన్‌మోహన్, రాజేందర్‌ ముదిరాజ్, గొరిగె మల్లేశం యాదవ్, నీల వెంకటేష్, ఉపేందర్‌ గౌడ్, శ్రీనివాస్‌ యాదవ్, బి.భిక్షపతి, పృథ్వీగౌడ్, రమాదేవి, గణేష్, కోల శ్రీనివాస్, 112 బీసీ కుల సంఘాల ప్రతినిధులు, 28 బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement