ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌ చేశారు

Priyanka Gandhi Phone Hacked Through WhatsApp Spyware - Sakshi

ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ఫోన్‌ హ్యాక్‌కు గురైందని ఆ పార్టీ ఆరోపించింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ వల్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఫోన్లు హ్యాక్‌కు గురైనట్లు వాట్సాప్‌ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని యూజర్లకు తెలిపేందుకు వాట్సాప్‌ ప్రత్యేక సందేశాలను బాధితులకు పంపింది. ఇలాంటి సందేశం ప్రియాంకాగాంధీ ఫోన్‌కు కూడా వచ్చినట్లు కాంగ్రెస్‌  ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఆదివారం స్పష్టంచేశారు. అయితే, పెగాసస్‌ వల్లనే హ్యాక్‌ అయినట్లు ఆ వాట్సాప్‌ సందేశం పేర్కొనలేదని చెప్పారు. ఈ హ్యాక్‌ను ప్రభుత్వమే చేయించిందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం కుట్రపూరిత మౌనాన్ని అవలంబిస్తోందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రయత్నిస్తోందని చెప్పారు.  

ప్రభుత్వానికి ముందే చెప్పాం: వాట్సాప్‌
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ భారత్‌కు చెందిన 121 మందిని టార్గెట్‌ చేసుకుందని సెప్టెంబర్‌లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని వాట్సాప్‌ సంస్థ చెబుతోంది.  అయితే, దీనిపై వాట్సాప్‌ తమకు పూర్తి సమాచారం ఇవ్వలేదని ఐటీ శాఖ పేర్కొంది.  కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఫోన్‌ హ్యాకింగ్‌పై సమావేశాలు జరపనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని హోంశాఖ కార్యదర్శి ద్వారా తెలుసుకోనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన ఘటనలు చింతించదగ్గవని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ అన్నారు.  15న జరగనున్న భేటీలో కశ్మీర్‌తో పాటు వాట్సాప్‌ అంశాన్ని కూడా చర్చిస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top