బీజేపీని ఓడించడానికి త్యాగాలకైనా సిద్ధం 

Prepare for sacrifices to defeat the BJP - Sakshi

      సమస్యలను తప్పుదారి పట్టించడానికే మతపరమైన వివాదాలు

      సీపీఎం రాష్ట్ర ప్లీనరీలో రాఘవులు  

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీని ఓడించడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంకావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాఘవులు ప్రారంభోపన్యాసంచేస్తూ నాలుగేళ్ల మోదీ పాలనలో దేశం సామాజికంగా, ఆర్థికంగా ధ్వంసమైందని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్‌ ధరల పెంపు తదితర అంశాలు దేశ ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని, దీంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందన్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోను, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయా లని సీపీఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ అమలుచేస్తున్న ఆర్థిక విధానాలవల్ల రాష్ట్రాలన్నీ బిచ్చగాళ్లుగా మారిపోతున్నాయని విమర్శించారు. నాలుగేళ్ల కాలంలో అనేక కార్మిక చట్టాలకు కేంద్రం తూట్లు పొడిచిందని విమర్శించారు. డాలర్‌తో పోల్చినప్పు డు రూపాయి విలువ  పడిపోతున్నదన్నారు. కుంభకోణాల్లో బీజేపీ నేతలు గతంలోని కాంగ్రెస్‌ను మించిపోయారని రాఘవులు ఆరోపించారు. రాఫెల్‌ దేశచరిత్రలో కనీవినీ ఎరుగని అతి పెద్ద కుంభకోణమన్నారు. అసలు ఏ రాష్ట్రంలోనూ స్థాపించని రిలయన్స్‌ యూనివర్సిటీకి మోదీ సర్కారు వెయ్యి కోట్లు అప్పుగా ఇచ్చిందన్నారు. సమస్యల్ని తప్పుదారి పట్టించడానికే మత వివాదాలకు తెరలేపుతోంద న్నారు. మతం, కులం పేరిట మూకదాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పెద్దనోట్ల రద్దుకు, జీఎస్టీకి మద్దతునిచ్చారని గుర్తుచేశారు.  నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన ఏపీ సీఎం చంద్రబాబు, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే ఎవరు నమ్ముతారని రాఘవులు ప్రశ్నించారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన మహాకూటమిలో చేరబోయేది లేదని స్పష్టం చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కేవరకూ పోరాడతామని అన్నారు.  ఈ ప్రాంతం వెనుకబాటుకు కారణం కాంగ్రెస్సేనని, అలాంటి పార్టీ నేతృత్వంలోని మహాకూటమి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అవసరమైన అజెండాను రూపొందించగలుగుతుందా.. అని ఆయన ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top