కాంగ్రెస్‌లో చేరిన పోట్ల నాగేశ్వరరావు

Potla Nageswara Rao Joins Congress Party  - Sakshi

సాక్షి, ఖమ్మం : తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు మరో సంవత్సరంలో రానుండటం, ఈ లోపు ముందస్తుగా జమిలి ఎన్నికలు రానున్నాయనే ప్రచారంతో...తెలంగాణలో వలసలు ఊపందుకున్నాయి. ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం మొదలైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పోట్ల నాగేశ్వరరావు సోమవారం అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన ఇటీవలే ఢిల్లీలో  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నవిషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం తొలిసారి ఖమ్మంకు వచ్చిన ఆయన కాంగ్రెస్ శ్రేణులు, పోట్ల అనుచరులు, అభిమానులు కోలాహలం మధ్య ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ...టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశానని, అధికార పార్టీలో కుటుంబ నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ కలగూర గంపగా మారిన నేపథ్యంలో విసుగు చెంది,కాంగ్రెస్లోకి వచ్చానన్నారు. ఫిబ్రవరిలో జిల్లా రాజకీయాలలో  ఆశ్చర్యకరమైన పరిణామాలు సంభవిస్తాయని, ఇంకా అనేక మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్, టీడీపీ పార్టీల నుండి కాంగ్రెస్లోకి వస్తారని జోస్యం చెప్పారు. వారంతా ఇప్పటికే తనతో సంప్రదింపులు జరిపినారని, ఈ విషయమై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు పోట్ల నాగేశ్వరరావు తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఆశీసులతోనే తాను కాంగ్రెస్లో చేరానని, పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. తనతోపాటు కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులకు ,కార్యకర్తలకు, అభిమానులకు పోట్ల ధన్యవాదాలు తెలిపారు.  2019 ఎన్నికలో పార్టీ గెలుపే థేయ్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు ముందుకు వెళతానని హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top