ఓటుకు పొత్తు పోటు

Political Parties Alliance in Lok Sabha Election - Sakshi

‘పొత్తు పార్టీ’ల మధ్య ఓట్లు బదిలీ అయ్యేనా  

కొన్నిచోట్ల సఫలం.. ఇంకొన్ని చోట్ల విఫలం

ప్రస్తుతం ఎన్నికలంటే.. కుల సమీకరణలు.. పొత్తుల కుంపట్లు.. పొత్తులే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయనేది పార్టీల నిశ్చితాభిప్రాయం. అయితే, ఈ పొత్తులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయా? ఓట్లు కురిపిస్తాయా? అనేది దశాబ్దాలుగా ఎన్నికల విశ్లేషకులను వేధించే ప్రశ్న. ఈసారి కూడా పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్న పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల మద్దతుదారుల ఓట్లు ఎంత వరకు బదిలీ అవుతాయో చెప్పడం కష్టం. అన్ని పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులు తమ అభ్యర్థులు లేనిచోట్ల మిత్రపక్షాల అభ్యర్థులకు ఓట్లు ఒకే తీరున వేయరని గతానుభవాలు చెబుతున్నాయి.

ఫలించని తొలి పొత్తు
ఉత్తరప్రదేశ్‌లో 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు పీవీ నరసింహారావు, బీఎస్పీ నేత కాన్షీరామ్‌ సమక్షంలో బీఎస్పీ 310, కాంగ్రెస్‌ 115 సీట్లకు పోటీచేయడానికి పొత్తు కుదిరింది. రెండు పార్టీలకు కలిపి వంద సీట్లే దక్కాయి. కారణం.. రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరగకపోవడమే. కాంగ్రెస్‌కు బీఎస్పీకి చెందిన దళితులు, బడుగువర్గాల ఓట్లు పడినా కానీ బీఎస్పీకి కాంగ్రెస్‌ మద్దతుదారులైన బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ఓట్లు బదిలీ కాలేదు. ‘కాంగ్రెస్‌కు తన ఓట్లను మిత్రపక్షాలకు బదిలీ చేసే శక్తి లేదు. ఇక నుంచి బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు’ అని కాన్షీరామ్‌ ప్రకటించారు. ఆయన మాట ప్రకారం మొన్నటి వరకూ నడుచుకున్న పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. యాదవులు, ఇతర బీసీల్లో పట్టున్న ఎస్పీ ఓట్లు దళితుల పార్టీగా ముద్రపడిన బీఎస్పీ అభ్యర్థులకు ఏ మేరకు పడతాయో చెప్పలేని స్థితి. ‘తన మిత్రపక్షాలకు ఓట్లను బదిలీ చేయగలనని ధైర్యంగా చెప్పుకోగల పార్టీ బీఎస్పీ ఒక్కటే. ఇతర పార్టీలు గరిష్ట స్థాయిలో తమ ఓట్లను బదిలీ చేయలేవు’ అని ఎన్నికల విశ్లేషకుడు యశ్వంత్‌ దేశ్‌ముఖ్‌ అభిప్రాయపడ్డారు.

పొత్తులతో మొదటికే మోసం?
తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో పార్టీల మధ్య పొత్తులే ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశంలో మిత్రపక్షాల మధ్య, అవసరం కొద్దీ శత్రుపక్షాల మధ్య పొత్తులు కుదురుతుంటాయి. భావ సారూప్యత, ఒకే రకమైన సామాజిక పునాదులున్న రాజకీయ పక్షాల మధ్య ఎన్నికల కలయికలు విజయవంతమై మంచి ఫలితాలనిస్తాయని గత ఎన్నికలు నిరూపించాయి. అయితే, ఇలాంటి పొత్తులు అరుదనే చెప్పాలి. పొత్తులు చాలా సందర్భాల్లో రాజకీయ పక్షాలకు ఇబ్బందికరమైన ఫలితాలనిస్తాయి. సీట్ల సర్దుబాటు వల్ల పోటీ చేయని ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బలహీనమైన సందర్భాలున్నాయి. అలాగే, పొత్తుల వల్ల కొన్ని పార్టీలు లబ్ధి పొందడం, మరి కొన్ని నష్టపోవడం మామూలే. కొన్ని సందర్భాల్లో రెండు పార్టీల పొత్తులు జనానికి నచ్చకపోతే రెండింటినీ వారు ఎన్నికల్లో తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. విడిగా పోటీచేస్తే పడే ఓట్లు కూడా పొత్తు కారణంగా ఇతర పక్షాలకు మళ్లిపోయే పరిస్థితి ఎదురవుతుంది.

ఉత్తరప్రదేశ్‌ : ఎస్పీ–బీఎస్పీ పొత్తు కిరికిరి
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు దేశంలోనే అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. ఎస్పీవైపు మొగ్గు చూపే బీసీలు ఇప్పటికీ దళితులను శత్రువులుగానే చూస్తున్నందున బీఎస్పీకి ఎస్పీ ఓట్లు బదిలీ అవుతాయనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే, కిందటేడాది బీజేపీ కంచుకోటలైన గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌లో బీఎస్పీతో పొత్తు ఎస్పీకి లాభించింది. పొత్తు ఫలించి రెండు సీట్లూ ఎస్పీ కైవసం చేసుకుంది. ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు తొలి పరీక్ష ఎస్పీకి ఫలించింది. బీఎస్పీకి విధేయులైన ఓటర్ల మాదిరిగా ఎస్పీ మద్దతుదారులైన యాదవులు అంతే స్థాయిలో మాయావతి పార్టీకి ఓటేయకపోచ్చని, ఎస్పీ చీలికవర్గమైన ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీకి కొందరు యాదవులు మద్దతిచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ తమ్ముడు శివపాల్‌సింగ్‌ యాదవ్‌ నాయకత్వాన ఈ కొత్త పార్టీ పోటీచేస్తోంది. ‘ఎస్పీ పోటీలో లేని అనేక చోట్ల యాదవులు శివపాల్‌ పార్టీ లేదా బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు కానీ, బీఎస్పీకి ఓటేయకపోవచ్చు’ అని పరిశీలకులు అంటున్నారు. కానీ, రెండు పార్టీలకు గతంలో వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే ఎస్పీ–బీఎస్పీ పొత్తు మంచి ఫలితాలనివ్వాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్‌ పొత్తు ఇలాంటిది కాదు. దీనివల్ల రెండు పార్టీలూ నష్టపోయాయి. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు పడిన ఓట్లు కలిపితే 42.12 శాతం కాగా, బీజేపీకి 42.63 శాతం ఓట్ల పడ్డాయి. రెండు పార్టీలకు లభించిన ఓట్ల ఆధారంగానే అఖిలేశ్‌ యాదవ్, మాయావతి పార్టీలు ఇప్పుడు చేతులు కలిపాయి.

బిహార్‌ : బిహార్‌లో హిట్‌.. తెలంగాణలో ఫట్‌
2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా పోటీచేసి గెలుపొందాయి. ఆర్జేడీ, జేడీయూకి కలిపి 35.2 శాతం ఓట్లు దక్కగా, ప్రత్యర్థి పక్షమైన బీజేపీకి 24.4 శాతం ఓట్లే వచ్చాయి. ఇక్కడ చాలా ఏళ్లు శత్రుపక్షాలుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూ మధ్య ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరిగింది. ‘ఇది జనం కోరుకున్న పొత్తు. అందుకే మంచి ఫలితాలొచ్చాయి. ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరిగింది. కేవలం పార్టీల అగ్రనేతల మధ్య కుదిరే పొత్తు వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే పొత్తులు ఫలిస్తాయి’ అని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా తెలిపారు. కిందటి డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితితో కూడిన మహా కూటమి ఘోర పరాజయం పాలైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తో తెలంగాణ ఏర్పాటును సమర్థించని తెలుగుదేశం చేతులు కలపడాన్ని ప్రజలు అంగీకరించలేదు. పాలకపక్షమైన టీఆర్‌ఎస్‌ పాలనతో అసంతృప్తి చెందిన జనం సైతం టీడీపీ కూటమిలో ఉండటాన్ని సహించలేక పెద్దసంఖ్యలో పాలకపక్షానికే ఓటేశారు. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్‌ బలపడకపోగా మరింత బలహీనమైంది. ఓటు బదిలీ సంగతి దేవుడెరుగు అసలు ప్రజలనే టీఆర్‌ఎస్‌ వైపు మళ్లేలా చేసింది ఈ పొత్తు. ఎక్కువ విధేయులైన మద్దతుదారులున్న పార్టీయే తన మిత్రపక్షానికి ఓట్లు బదిలీ చేయగలుగుతుందని సీఎస్‌డీఎస్‌ డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ చెప్పారు. ‘ఓట్ల బదిలీకి ఓ లక్ష్యం ఉండాలి. తెలంగాణకు కట్టుబడిన పార్టీకే ఓటెయ్యాలనే లక్ష్యమే టీఆర్‌ఎస్‌ విజయానికి దారితీసింది’ అని ‘సీ ఓటర్‌’ సంస్థకు చెందిన దేశ్‌ముఖ్‌ అన్నారు.

తమిళనాడు : ఫలించని డీఎంకే–కాంగ్రెస్‌ దోస్తీ
తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. నాటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా కేవలం 4.3 శాతం ఓట్లు సాధించింది. కానీ ప్రాంతీయ పక్షం డీఎంకేతో కలిసి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని పోటీచేసినా కాంగ్రెస్‌కు దక్కినవి ఆరు శాతం ఓట్లే. ఈ రెండు పార్టీలు సహజమైన రాజకీయ మిత్రపక్షాలు కాకపోవడంతో అటువంటి ఫలితాలొచ్చాయి. అందుకే ఈసారి కాబోయే ప్రధాని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అంటూ డీఎంకే నేత స్టాలిన్‌ ప్రకటించి మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నారు. ఈ నినాదం కలిసి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పాటు పీఎంకే, ఎండీఎంకే వంటి చిన్న పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అవుతాయి కానీ, చిన్న పార్టీల ఓట్లు పెద్ద పార్టీలకు పడవని చెన్నైకి చెందిన ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ అభిప్రాయపడ్డారు. మరి తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

మహారాష్ట్ర : వింత మిత్రులు..బీజేపీ–శివసేన
మహారాష్ట్ర పాలక సంకీర్ణ సర్కారులో జూనియర్‌ భాగస్వామి అయిన శివసేన గత నాలుగేళ్లలో అవకాశమొచ్చిన ప్రతిసారీ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడగానే రెండు పార్టీలూ మళ్లీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగుతుందని ప్రకటించాయి. నరేంద్రమోదీని ప్రధానిని చేయడానికి శివసేన అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు మద్దతు ఇస్తారని, కాంగ్రెస్‌ను నిలువరించడానికి బీజేపీకి శివసేన ఓట్లేయిస్తుందని ఎన్నికల నిపుణులు జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ తెచ్చుకునే అవకాశం లేనందున అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులు పెట్టుకుంటోందని శివసేన నేత సంజయ్‌రౌత్‌ చెప్పారు. అయితే, ఈ పొత్తు మునుపటిలా అంత సజావుగా సాగదనీ, గత కొన్నేళ్లలో రెండు పక్షాల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని, 2014లో మాదిరిగా రెండింటి మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరగదని సీఎస్‌డీఎస్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అభిప్రాయపడుతున్నారు.

అస్సోం : కలవని మనసులు
అస్సోంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాం తీయ పక్షమైన అస్సోం గణపరిషత్‌ (ఏజీపీ) తో కలిసి బీజేపీ పోటీచేసి గెలుపొందింది. ఇటీవల పౌరసత్వ సవరణ బిల్లుపై విభేదాల కారణంగా కాషాయ పక్షానికి ఏజీపీ దూరమైంది. మళ్లీ లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించగానే రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. కానీ, రెండు పార్టీల కార్యకర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు ఫలితాలివ్వకపోవచ్చని భావిస్తున్నారు. పౌరసత్వ సమస్య వంటి కీలకాంశంపై బహిరంగ విభేదాలు లేకుంటే బీజేపీ–ఏజీపీ పొత్తు పార్లమెంటు ఎన్నికల్లో సత్ఫలితాలివ్వడానికి అవకాశం ఉండేది. కానీ, మారిన రాజకీయ వాతావరణంలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. దాదాపు 24 ఏళ్ల పాటు బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ నేతలు అఖిలేశ్‌ యాదవ్, మాయావతి 11 ప్రచార ర్యాలీల్లో కలిసి పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి తెలుసు. అయినా, ఐదేళ్ల క్రితం మోదీ ప్రభంజనంలో రెండు పార్టీలూ కొట్టుకుపోయాయి. తమ ఉనికి కాపాడుకోవడానికి కుదుర్చుకున్న పొత్తు కాబట్టి ఇది ఫలిస్తుందని ఇద్దరూ నమ్ముతున్నారు.

2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు
పొత్తు: ఆర్జేడీ– జేడీయూ– కాంగ్రెస్‌
ఫలితం: ఈ కూటమిదే విజయం
(ఆర్జేడీ– 80, జేడీయూ– 71,కాంగ్రెస్‌– 27)
కారణం: బీసీలు, మైనారిటీల నుంచి కూటమికి లభించిన సంపూర్ణ మద్దతు
2019 మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు
పొత్తు: బీజేపీ– శివసేన
ఏం జరుగుతుంది?: రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా, సంపూర్ణంగా జరిగే అవకాశం

2019 లోక్‌సభ ఎన్నికలు
పొత్తు: బీజేపీ–ఏఐడీఎంకే–డీఎండీకే–పీఎంకే వర్సెస్‌ డీఎంకే–కాంగ్రెస్‌–ఇతర చిన్న పార్టీలు
ఏం జరుగుతుంది?: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ప్రధాని అభ్యర్థి అని డీఎంకే నేత స్టాలిన్‌ ప్రకటించిన కారణంగా రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరిగే అవకాశం

1996 యూపీ అసెంబ్లీ ఎన్నికలు
పొత్తు: బీఎస్పీ – కాంగ్రెస్‌
ఫలితం: హంగ్‌ అసెంబ్లీ
(బీఎస్పీ– 67, కాంగ్రెస్‌– 33)
కారణం: బీఎస్పీకి కాంగ్రెస్‌ ఓట్లు బదిలీ కాలేదు

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలు
పొత్తు: ఎస్పీ – కాంగ్రెస్‌
ఫలితం: బీజేపీకి భారీ మెజారిటీ
224 నుంచి 47కు తగ్గిన ఎస్పీ సీట్లు 28 నుంచి 7కి తగ్గిన కాంగ్రెస్‌ బలం
కారణం: రెండు పార్టీల కలయిక ఆచరణలో ఏ రకంగానూజరగలేదు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top