డేటా.. కాసుల మూట..! | Political Leaders Collected Voters Phone Numbers Secretly In Telangana | Sakshi
Sakshi News home page

Dec 1 2018 2:31 AM | Updated on Dec 1 2018 2:31 AM

Political Leaders Collected Voters Phone Numbers Secretly In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కుత్బుల్లాపూర్‌లో ఉండే.. ఓ ఓటరు ఫోన్‌కు సందేశం వచ్చింది. ‘‘సికింద్రా బాద్‌ నుంచి మీరు తప్పకుండా నన్నే గెలిపించాలి’’అన్నది దాని సారాంశం. ఇది చదివి ఓటరు బిత్తరపోయాడు’. కోరుట్లలో ఉండే ఓ వ్యాపారికి ‘మనవాళ్లు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు మీరు తప్పకుండా రావాలి’’అని ఫోన్‌లో సందేశం అందింది. తన సామాజిక వర్గం తెలుసుకుని మరీ ఎలా ఫోన్‌ చేశారబ్బా.. అని అతను జుత్తుపీక్కున్నాడు. అసలు బొత్తిగా పరిచయం లేని వ్యక్తులకు ఫోన్‌నెంబర్లు ఎలా తెలిశాయన్నది ఇక్కడ మొదటి పాయింట్‌. కాగా, ఒక ప్రాంతంలో నివసించి, ఇపుడు చిరునామా మారినా వారికి ఇంకా పాత ప్రాంతం నేతల నుంచి ఆహ్వానాలు, వినతులు వస్తుండటం రెండోపాయింట్‌. ఎలాంటి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోన్‌ నంబర్లను సంగ్రహించ డాన్ని ప్రజలు తప్పుబడుతుంటే, సామాజిక వర్గం తెలుసుకుని మరీ ప్రచారం మొదలుపెట్టడాన్ని విద్యావంతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. 

డేటా ఎలా లీకవుతోంది? 
నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి, అభ్యర్థుల ఖరారు అంశం కొలిక్కి వచ్చింది. ఇక దాదాపు అందరు నేతలు ప్రచారపర్వంలోకి దూకారు. ప్రచారమూ మొదలు పెట్టారు. తమకు ఓటేయాలంటూ ప్రతీరోజు వీడియో, ఆడియో, రికార్డ్‌ వాయిస్‌ సందేశాల ద్వారా మోత మోగిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 2.80 కోట్ల మంది ఫోన్‌ నెంబర్లలో అధికశాతం ఫోన్‌నెంబర్లు కొందరు ఏజెంట్ల వద్ద ఉన్నాయి. వీరికి హైదరాబాద్‌తోపాటు, తెలంగాణ జిల్లాల్లో ఫోన్‌నెంబర్లు సేకరించడమే పని. ఇందుకోసం వారు కేబుల్, కాలనీ సంక్షేమ సంఘాలు, టౌన్‌షిప్‌ ఆఫీసులు, గ్యాస్‌ ఏజెన్సీ, జిరాక్స్, మీసేవా కేంద్రాల్లో పనిచేసే చిన్నస్థాయి ఉద్యోగులను వశం చేసుకుంటారు. పదో పరకో ఇచ్చి.. మొత్తం డేటాతోపాటు, వ్యక్తుల ఫోన్‌నెంబర్లను కూడా సంగ్రహిస్తున్నారు. ఇక జిల్లాల్లో అయితే జిరాక్స్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వాళ్లు ఫోన్‌ నంబర్లతోపాటు వాళ్ల సామాజికవర్గం కూడా తెలుసుకుని అందిస్తున్నారు. ఈ డేటానే ఏజెంట్లు రాజకీయ నేతలకు అందిస్తూ అందినకాడికి రాబడుతున్నారు. 

నేతలకూ టోకరా.. 
ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో చాలా నెంబర్లు ఏడాది కింద సేకరించినవే. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది చిరునామాలు మారాయి. ఓట్లు కూడా బదిలీ అయ్యాయి. ఈ విషయం తెలియకుండా ముందే డేటా కొనేసిన రాజకీయ నేతల అనుచరులు వారికి కూడా సందేశాలు పంపిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇదేం ఖర్మరా నాయనా అనుకుంటూ పౌరులు చికాకుపడుతున్నారు. ఇలా వెళుతున్న రికార్డెడ్‌ వాయిస్‌లు, సంక్షిప్త సందేశాల్లో చాలావరకు నియోజవకర్గంతో సంబంధం లేని వారికే వెళ్తుండటం గమనార్హం. 

వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బందే..
వ్యక్తుల సమాచారం వారి అనుమతి లేకుండా సంగ్రహించడం నేరం. అదే విధంగా వివిధ వ్యక్తుల ఫోన్లకు వేళాపాలా లేకుండా ఫోన్లు చేసి విసిగించడం ముమ్మాటికీ తప్పేనని టెలీకామ్‌ అధికారులు స్పష్టంచేస్తున్నారు. మరోవైపు పౌరుల కులం కనుక్కుని కార్తీక వనభోజనాలు, కుల సంఘాల మీటింగుల పేరిట ఆహ్వానాలు పంపడంపైనా చాలామంది మండిపడుతున్నారు. అయితే, ఈ విషయంలో ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. అభ్యర్థులను నేరుగా నిలదీయలేరు. అలాగని ఇలాంటి ఆహ్వానాలకు స్పందించలేక విసుక్కుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement