వారు అబద్ధాల యంత్రాలు

PM Modi slams Congress while addressing BJP workers - Sakshi

ఏకే–47 తుపాకీలా అబద్ధాల వర్షం కురిపిస్తారు

విపక్షాలపై మండిపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ

కుటుంబ పాలన రక్షణ కోసం ఏకమవుతున్నారని విమర్శ

న్యూఢిల్లీ: కుటుంబ పాలనను కాపాడుకునేందుకే దేశంలోని ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌ భవిష్యత్‌ను మార్చేందుకు బీజేపీ కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రతిపక్ష కూటములను చూసి బెదిరిపోవద్దనీ, ప్రజలే వారిని తిరస్కరిస్తారని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకుండా, సైన్యాన్ని, దేశాన్ని అవమానించేవారిని ప్రజలు అసహ్యించుకుంటారని వ్యాఖ్యానించారు. ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లోని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ శనివారం ప్రసంగించారు. ‘కాంగ్రెస్, కమ్యూనిస్టుల వంటి దేశద్రోహుల నుంచి భారత్‌కు కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?’ అని ఓ బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ పైవిధంగా స్పందించారు.

250 కుటుంబాలకు భయం పట్టుకుంది..
వచ్చే ఏడాది జరిగే లోక్‌ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, వామపక్షాలు, స్థానిక పార్టీలు చేతులు కలుపుతున్న నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రభుత్వం దేశ భవిష్యత్‌ను మార్చేందుకు పనిచేస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం తమ కుటుంబ పాలనపై ఆందోళన చెందుతున్నాయి. తమ వారసుల రాజకీయ భవిష్యత్‌ కోసం ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ‘బీజేపీ మరో 5 నుంచి పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంటే మా పరిస్థితి ఏంటి?’ అని 200–250 రాజకీయ కుటుంబాలకు భయం పట్టుకుంది.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ కుటుంబాలు దేశ రాజకీయాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. తమ రాజకీయ వారసుల కోసం ఏదో ఒకటి వదిలివెళ్లాలన్న ఆశతో ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు ఏకం అవుతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాల సమాచారాన్ని కార్యకర్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, కీలక పథకాలను ప్రజలకు వివరించాలి’ అని సూచించారు. పన్ను విధానం, కంపెనీల ఏర్పాటులో తాము చేపట్టిన సంస్కరణల ఫలితంగా సులభతర వాణిజ్యవిధానంలో భారత్‌ ర్యాంకు 142 స్థానం నుంచి ఏకంగా 77వ స్థానానికి ఎగబాకిందన్నారు.

కుట్రలను కార్యకర్తలు విచ్ఛిన్నం చేయాలి
ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ ఫైటర్‌జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చెబుతున్నవి అబద్ధాలని ప్రజలు సులభంగా తెలుసుకోవచ్చు. కొందరు ప్రతిపక్ష నేతలు అబద్ధపు యంత్రాల్లాగా ఉంటారు. వాళ్లు నోరు తెరవగానే ఏకే–47 తుపాకీలోని బుల్లెట్లలా అబద్ధాల వర్షం కురుస్తుంది. ప్రజలకు నిజాలు చెప్పి బీజేపీ కార్యకర్తలు ఈ కుట్రను విచ్ఛిన్నం చేయాలి. ప్రతిపక్షాలు నిర్వహించే కొన్ని సభలకు హాజరై నాకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నవారిలో చాలామందికి అసలు ఆ సభ ఎందుకు జరుగుతోందో కూడా తెలియదు. రఫేల్‌ కొనుగోలులో బీజేపీ కార్యకర్తలు మథనపడాల్సిన అవసరం లేదు. ఓ 100 మంది ప్రజలతో మాట్లాడితే మీ ధైర్యం, నమ్మకం ద్విగుణీకృతం అవుతాయి’ అని మోదీ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top