తనయుల పీఠం కోసమే తపన

Nitin Gadkari fires on Sonia Gandhi and KCR - Sakshi

సోనియా, కేసీఆర్‌లపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విమర్శలు

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట/కొల్లాపూర్‌/హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి సోనియాగాంధీ, కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్‌ తపన పడుతున్నారని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో పార్టీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్‌రావు తరఫున ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. సోనియా, కేసీఆర్‌లకు రైతులపై చిం తలేదని, అధికారం కోసం కలలు కంటున్నారన్నారు. తెలంగాణలో ఐదేళ్లలో రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారులు నిర్మించామని, రైతులకు విద్యుత్, ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందిస్తోందన్నారు. సభలో ఆ పార్టీ అభ్యర్థులు సంకినేని వెంకటేశ్వరరావు, కడియం రామచంద్రయ్య, బొబ్బ భాగ్యారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సోమశిల – సిద్ధేశ్వరం వంతెన నిర్మిస్తాం
బీజేపీని గెలిపిస్తే సోమశిల– సిద్ధేశ్వరం వంతెన నిర్మిస్తామని గడ్కరీ హామీనిచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి సుధాకర్‌రావుకు మద్దతుగా ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో గడ్కరీ ప్రసంగించారు. వంతెనకు జాతీయ రహదారి హోదా కూడా కల్పిస్తామన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు మద్దతు ఇస్తామని గడ్కరీ తెలిపారు. సభలో దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ జెండా ఎగరవేస్తాం...
ప్రధాని కొడుకు ప్రధాని కావాలి, సీఎం కొడుకు సీఎం కావాలంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే సంప్రదాయానికి అడ్డుకట్ట వేసింది బీజేపీయేనని గడ్కరీ అన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం చిలకలగూడలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రూపురేఖలను మార్చే శక్తి మోదీ నేతృత్వంలోని బీజేపీకే ఉందని, ఇక్కడి ప్రజలు బీజేపీ ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని, ఈమారు తెలంగాణలో బీజేపీ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు
బీజేపీ సహకారంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గడ్కరీ అన్నారు. ఆదివారం ఉప్పల్‌ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు మద్దతుగా ఏర్పాటు చేసినసభలో ఆయన మాట్లాడారు. ఇవి పార్టీల భవిష్యత్‌ను కాకుండా, రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ.50 వేల కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చన్నారు. అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top