మోదీ ఇచ్చిందేంటో స్వతంత్ర సంస్థలతో విచారించుకోండి

Nitin Gadkari fires on Chandrababu - Sakshi

కేంద్రంపై విమర్శలు చేసే వారికి సవాల్‌ చేస్తున్నా..

ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమిచ్చాయో చెప్పండి?

చంద్రబాబుపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ధ్వజం  

సాక్షి, అమరావతి/సాక్షి, ప్రతినిధి ఏలూరు: ఈ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన సాయంతో.. అంతకు ముందు ప్రభుత్వాలు 50–60 ఏళ్లలో చేసిన సాయాన్ని పోల్చి చూసుకోవాలంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సవాల్‌ విసిరారు. అవసరమైతే మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమిచ్చిందో స్వతంత్ర సంస్థలతో సామాజిక, ఆర్థిక సర్వే చేయించుకోవచ్చన్నారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన గడ్కరీ ఉదయం విజయవాడలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. మొన్నటి వరకు తమ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నేతలు నిత్యం బీజేపీపైన, మోదీపైన విమర్శలు చేస్తున్నారని గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల మోదీ పాలన ఏపీకి స్వర్ణయుగంలా నడిచిందన్నారు. గత ప్రభుత్వాల కంటే మోదీ ప్రభుత్వమే రాష్ట్రానికి ఎక్కువ సాయం చేసిందని చెప్పారు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ప్రతి రూపాయి కేంద్రమే ఇస్తుంటే.. చంద్రబాబు మాత్రం క్రెడిట్‌ కొట్టేస్తున్నారని విమర్శించారు. పైగా నిత్యం మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజల కళ్ల ముందే వాస్తవాలు..
ఏపీతో పాటు 4 దక్షిణాది రాష్ట్రాల్లో 284 లక్షల ఎకరాలకు సంబంధించిన సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.60 వేల కోట్లతో గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధాన కార్యక్రమం చేపడుతున్నట్లు గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌లను కేబినెట్‌ సమావేశంలో ఉంచి ఆమోదం తీసుకోబోతున్నామన్నారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయానికి సంబంధించిన వాస్తవాలు ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయని గడ్కరీ చెప్పారు. ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం తన శాఖ నుంచి ఈ ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువ చేసే పనులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2014 మే నెలకు ముందు 4,193 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులుండగా.. ఈ ఐదేళ్లలో దాన్ని 7,246 కిలోమీటర్లకు పెంచినట్లు వివరించారు. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తోందన్నారు. అలాగే అమరావతి బైపాస్‌ రింగ్‌ రోడ్డుకు కూడా నిధులిస్తున్నట్టు తెలిపారు.

సాగర్‌మాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 108 పోర్టుల కనెక్టవిటికీ రూ.1.64 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు గుర్తించినట్టు తెలిపారు. వీటిలో 71 పనులు పూర్తయ్యాయని చెప్పారు. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయడంతో పాటు రూ.45,620 కోట్లతో కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ క్లస్టర్, రూ.3,328 కోట్లతో అపెరల్‌ క్లస్టర్, రూ.24,500 కోట్లతో సిమెంట్‌ క్లస్టర్, రూ.15 వేల కోట్లతో షిప్పింగ్‌ హార్బర్లను కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎంత దోచుకున్నా చంద్రబాబు ధన దాహం, భూ దాహం తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ  నేతలు సునీల్‌ ధియోధర్, జీవీఎల్‌ నరసింహరావు, గోకరాజు, పురందేశ్వరి, విష్ణుకుమార్‌రాజు, కావూరి సాంబశివరావు, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని 39 జాతీయ రహదారులకు సంబంధించి రూ.16,878 కోట్లతో 1,384 కిలోమీటర్ల మేర చేపట్టిన ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపనలతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. తన శాఖ ద్వారా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, జలరవాణా, రోడ్లు, పోర్టుల అభివృద్ధికి గానూ ఏపీకి రూ.3 లక్షల కోట్లు కేటాయించానన్నారు. గుండ్లకమ్మతో పాటు ఇతర ప్రాజెక్టులకు అనుమతులిచ్చి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.44 వేల కోట్లతో 2,520 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టామన్నారు. రూ.775 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులను సాగరమాల కింద ఏపీకి కేటాయించామన్నారు.

గడ్కరీపై మంత్రి అయ్యన్న పొగడ్తల వర్షం 
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు నితిన్‌ గడ్కరీ సమావేశానికి తెలుగుదేశం మంత్రులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడమే కాకుండా ఆయనను పొగడ్తల వర్షంలో ముంచెత్తడం చూసి సభికులు ఆశ్చర్యపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా చంద్రబాబు చేస్తున్న విమర్శలు ఉత్తుత్తివేనా అని చర్చించుకోవడం కనిపించింది. మోదీకి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపార వేత్త అదానీకి చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల విలువైన బొగ్గు గనులు కట్టబెట్టడాన్ని కూడా జనం గుర్తు చేసుకుంటున్నారు. దీన్ని బట్టే బీజేపీతో టీడీపీకి ఇంకా లోపాయికారీ ఒప్పందం కొనసాగుతుందనే విషయం తేటతెల్లమవుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆకివీడులో జరిగిన సభలో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నితిన్‌ గడ్కరీ పనిచేసే కేంద్ర మంత్రి అని, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలిసిన వ్యక్తి అంటూ కొనియాడారు. గడ్కరీ పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో 13 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 2,164 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చిన ఘనత గడ్కరీకే దక్కుతుందన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి మంత్రిని చూడలేదని పొగడ్తలతో ముంచెత్తారు. రూపాయి సాయం చేసిన వారికి దండం పెడతారని.. అలాంటిది రూ.16 వేల కోట్లతో హైవేలు అభివృద్ధి చేస్తున్న గడ్కరీకి ఎన్ని దండాలు పెట్టాలో చెప్పాలంటూ ప్రసంశల జల్లు కురిపించారు. రాజకీయాలు ఉన్నా కూడా సాయం చేసిన వారిని మర్చిపోకూడదన్నారు. కార్యక్రమంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పొందువ్వ శ్రీను, ఎమ్మెల్యే శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top