నియంతృత్వ వైఖరి వీడాలి

New Democracy Leaders Slams KCR In Khammam - Sakshi

నాడు కేసీఆర్‌కు మద్దతివ్వకుంటే ప్రత్యేక రాష్ట్రం ఉండేదా..?  

ఎన్డీ నేత రంగారావు పట్ల పోలీసుల తీరు బాధాకరం 

సాక్షి, ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతృత్వ వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం(రామనర్సయ్య విజ్ఞానకేంద్రం)లో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు ఎండీ.జావీద్, తెలంగాణ జన సమితి  నాయకులు బత్తుల సోమయ్య, జెఏసీ నాయకులు కేవీ.కృష్ణారావు తదితరులు మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తుంటే ముఖ్యమంత్రి మొండి వైఖరి అవలంబిస్తున్నారన్నారు.

హైకోర్టు గడువు ఇచ్చి ఆ లోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ నేటి వరకు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే వారికి ప్రజలు, అఖిలపక్ష పార్టీలు పూర్తి మద్దతునిస్తే వారిపై పోలీసులచే దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు హైదరాబాద్‌లో ఆందోళనలో పాల్గొంటే పోలీసులు దౌర్జన్యంగా వ్యాన్‌లో ఎక్కించి డోర్‌ వేస్తే రంగారావు బోటన వేలు తెగిపోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో జిల్లాకు కేసీఆర్‌ వస్తే నాడు అండగా ఉండి ఆదుకున్నది పోటు రంగారావు, న్యూడెమోక్రసీ పార్టీ కీలకపాత్ర పోషించగా మిగిలిన పార్టీలు, ప్రజలు, ఇతర సంఘాలు సహకరించాయన్నారు.

ఆ విషయాన్ని మరిచి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారా..? నాడు ఉద్యమ సమయంలో నాటి కాంగ్రెస్‌ పార్టీ అలాగే అడ్డుకుంటే నేడు రాష్ట్రం ఏర్పడేదా...? అని ప్రశ్నించారు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని గుర్తించాలన్నారు.  పోటు రంగారావు బొటన వేలు తెగిపోయిన సంఘటననను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 20(నేటి)నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, టీడీపీ నాయకులు తోటకూరి శివయ్య, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుమలరావు, టిజెఏసి నాయకులు చిర్రా రవి తదితర నాయకులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top