‘నిరాశ-నిస్పృహలకు చోటే లేకుండా పోయింది’

Narendra Modi Speech in UAE Opera House - Sakshi

అబుదాబి : భారత్‌లో నిరాశ, నిస్పృహలకు చోటు లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల్లో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నార్థకం పోయి.. పని ఎప్పుడు పూర్తవుతుందనే విశ్వాసం ఏర్పడిందని ఆయన తెలిపారు. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం దుబాయ్‌ ఓపెరా హౌజ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసగించారు.

‘ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఉన్నారు. ఇండియా నుంచి వచ్చిన సుమారు 30 లక్షల మందికి యూఏఈ సొంత దేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషంగా ఉంది. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచస్థాయిలో భారత్‌ గౌరవం పరిఢవిల్లుతోంది. యూఏఈ ప్రగతి పథంలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషం. భారత అభివృద్ధిలోనూ మీరూ(ప్రవాస భారతీయులను ఉద్దేశించి) భాగస్వాములు కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆయన.. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇక ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మోహముద్ బిన్ సల్మాన్‌ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఇది భారత సంస్కృతికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రసంగానికి ముందు ఆయన అబుదాబిలో తొలి హిందూ దేవాలయానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి 2వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

ఇక ఉదయం అబుదాబి లోని అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.  యూఏఈ పర్యటనలో భాగంగా దేశ పాలకుడు, ప్రధానిలతోపాటు, అక్కడి భారతీయ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ఇప్పటికే భారత్ - యూఏఈ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగం, రైల్వేలు, మానవ వనరులు, ఆర్థిక సేవలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఇంధన భద్రత, మౌలికరంగాల్లో యూఏఈ సుమారు 11 మిలియన్‌ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top