అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ నారా లోకేశ్‌

Nara Lokesh is a Brand Ambassador for Corruption says Mithun Reddy - Sakshi

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజం  

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అవి నీతిలో దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చారని వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన లోకేశ్‌ తమ పార్టీ ఎంపీల రాజీనామాల గురించి తప్పుడు ప్రకటనలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. ఎయిర్‌ ఏషియా కుంభకోణం జనం దృష్టికి రాకుండా పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యేక హోదా సాధన కోసం ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురం ఎంపీలం పదవులకు రాజీనామా చేశాం. మేం ఇప్పుడే రాజీనామాలు చేసినట్లుగా టీడీపీ ఎంపీలు,  పప్పు మాట్లాడటం హాస్యాస్పదం’’అని విమర్శించారు. 

ఇదేనా ప్రజాస్వామ్యం?  
‘‘ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ చిత్తశుద్ధితో పోరాడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాపై నిందలు వేయాలని చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. టీడీపీ ఎంపీలు నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని పొగడడమే సరిపోయింది. ఆఖరి బడ్జెట్‌ బాగా లేదని యూటర్న్‌ తీసుకొని ఏదోదే మాట్లాడటం వెనుక స్వార్థం తప్ప మరేమీ లేదని ప్రజలు తెలుసుకున్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, బీజేపీ నేత లు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని మాట్లాడుతున్న చంద్రబాబు ఏపీలో చేసిందేమిటి? కనీసం ఎంపీగా ప్రమాణం చేయకముందే ఎస్పీవై రెడ్డిని లాక్కున్నారు.

తర్వాత ప్రలోభాలతో కొత్తపల్లి గీత, బుట్టా రేణుకను టీడీపీలో చేర్చుకున్నారు. దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు అనేకసార్లు ఫిర్యాదులు ఇచ్చినా అతీగతి లేదు. నారా లోకేశ్‌ దేశవ్యాప్తంగా అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు సంపాదించారు. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలుపుతామంటూ అవినీతిలో నంబర్‌వ¯Œన్‌ స్థానంలో నిలిపారు. ఏ సంస్థ సర్వే చేసినా అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటోంది. ఇందులో లోకేశ్‌ పాత్రే కీలకం. ఇలాంటి పప్పు మావైపు వేళ్లు చూపుతారా? సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఏ విధంగా కొన్నారు. రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top