చంద్రబాబుకు ముద్రగడ హెచ్చరిక

Mudragada Writes Open Letter To Chandra babu - Sakshi

సాక్షి, కాకినాడ : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆర్టీసీ బస్సులపై తెలుగుదేశం పార్టీ నాయకుల పోస్టర్లు చిరిగినందుకు దౌర్జన్యం చేస్తారా? అంటూ నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబుకు బహిరంగ లేఖను రాశారు.

పోస్టర్లను సొంత వాహనాలపై అంటిచుకోవాలంటూ ముఖ్యమంత్రికి ముద్రగడ చురకలంటించారు. ఇలాంటి దాడులను ఆపకపోతే ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని కాపు జాతికి పిలుపునిస్తానని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వద్ద డబ్బు బలం ఉంటే తమ వద్ద జన బలం ఉందన్నారు.

కులాల మధ్య గొడవల అలజడులను రేపుతూ అధికారం కోసం టీడీపీ ఎన్నో తమషాలు చేస్తోందని ఆరోపించారు. ‘పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం చేస్తున్నారు. మిమ్మల్ని విమర్శించే వారి కుటుంబాలను అవమానిస్తున్నారు. మరి మీ భార్య, కోడలిపై విమర్శలు చేస్తే మీ పరిస్ధితి ఏమిటో ఆలోచించుకోండి.

ప్రత్యేక హోదా వంకతో మీ జన్మదినాన ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసిన కోట్లాది రూపాయల వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలి. ఎదుట వ్యక్తికి వేలు చూపి విమర్శించేప్పుడు.. మూడు వేళ్ళు ఎవరిని చూపిస్తాయో తెలుసుకుని నడవండి’ అంటూ లేఖను ముగించారు ముద్రగడ.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top