అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పని 

MP Vinod Kumar comments on congress - Sakshi

ఎంపీ వినోద్‌కుమార్‌ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కొత్తగా ఏర్పడిన తెలంగాణలో జరుగుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధిని చూసి.. తమ ఉనికిని కోల్పోతామనే భయంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ విమర్శించారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగానికి వరప్రదాయినిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరగకుండా అడుగడుగునా కాంగ్రెస్‌ మోకాలడ్డుతోందని ఆరోపించారు. కోర్టు కేసులను ఛేదించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను సకాలంలో తీసుకువచ్చామన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ సాధించలేని ఘనతను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిందని, మహారాష్ట్ర సర్కార్‌తో మాట్లాడి అనుమతులు పొందామని ఎంపీ వినోద్‌ వివరించారు.

చివరకు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేసి నాలుగు నెలలు పనులు అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ ఎంపీలమంతా ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్‌ ఎత్తులను చిత్తుచేశామన్నారు.విభజన సమయంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిదులు ఇచ్చేందుకు ఒప్పుకుని ఇప్పటికీ 9 వేల కోట్లు కట్టబెట్టిందన్నారు. అదే తరహాలో మన కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్‌ గుగ్గిల్లపు రమేశ్, గ్రంథాలయ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top