ఇదీ ఈబీసీ కోటా కథ

Modi govt approves 10 per cent reservation for poor in general category - Sakshi

అగ్రవర్ణ పేదలు 6 కోట్లు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్‌ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నో ఏళ్ల నేపథ్యం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల కిందకు రాని అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వాలనే డిమాండ్‌ 30 ఏళ్ల క్రితమే వచ్చింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్‌ ఇస్తామని మొదట హామీ ఇచ్చిన రాజకీయ నేత  బీఎస్పీ స్థాపకుడు కాన్షీరామ్‌. తర్వాత ఈ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. కేంద్రమంత్రి, ఆర్పీఐకి చెందిన రాందాస్‌ అఠావలే కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రతిపాదనను సమర్థించారు.  

సిన్హో కమిషన్‌
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందని.. అగ్రవర్ణ పేదల కోసం యూపీఏ సర్కారు ‘జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్‌’ను 2006లో నియమించింది. ఈ వర్గాల జీవన స్థితిగతుల అధ్యయనానికి మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఎస్‌ఆర్‌ సిన్హో చైర్మన్‌గా,  మహేంద్రసింగ్‌ సభ్యులుగా కమిషన్‌ ఏర్పాటు చేశారు. 2008 జనవరి నాటికి ఈ కమిషన్‌ నివేదిక ఇవ్వాల్సిఉండగా, అనేక పొడిగింపుల తర్వాత,  చివరికి యూపీఏ–2 హయాంలో 2010లో నివేదిక ఇచ్చింది.

కోటి కుటుంబాలు
ఎనిమిదేళ్ల క్రితం అగ్రవర్ణ పేదల సంఖ్య ఆరు కోట్లుగా ఈ కమిషన్‌ అంచనా వేసింది. దాదాపు కోటి కుటుంబాలున్నాయంది. అగ్రవర్ణ పేదలకు కోటా కల్పించడానికి తొలి అడుగుగా యూపీఏ ఈ కమిషన్‌ను నియమించింది. కమిషన్‌ సభ్యులు 28 రాష్ట్రాల్లో పర్యటించి సామాజికంగా బలహీనవర్గాలకు(ఎస్సీ, ఎస్టీ, బీసీ) చెందని కులాల జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు. ఆదాయ పన్ను కట్టని అగ్ర కులాలకు చెందిన పేదలను ఓబీసీ(అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌)లతో సమానంగా పరిగణించాలనే ప్రతిపాదన మొదట ఈ కమిషన్‌ చేసింది. ఆర్థికంగా బలహీనులైన ఈ వర్గాలు బీసీల స్థాయిలో ఉన్నారని కూడా తెలిపిందని వార్తలొచ్చాయి. ఓబీసీలతో సమానంగా ఈ అగ్రవర్ణ పేదలను ప్రభుత్వం చూడాలని కమిషన్‌ కోరింది. ఈ కమిషన్‌ నివేదికలోని విషయాలను ఇంత వరకూ అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు.

రాజ్యాంగ సవరణ అవసరం
సామాజికంగా వెనుకబడని వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించాలంటే రాజ్యాంగంలోని 15, 16 అధికరణల సవవరణ అవసరం. అలాగే ప్రస్తుత అన్ని కోటాల పరిమితిని 50% నుంచి 60 శాతానికి పెంచడానికి కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్ల మొత్తం 50 శాతం దాటకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త కోటా అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. అలా చేర్చాక కూడా దాన్ని పరిశీలించే అధికారం తమకు ఉంటుందని 2007లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో ఇందిరా సహానీ వర్సెస్‌ కేంద్రం కేసులో అన్ని కోటాలకు 50% గరిష్ట పరిమితి విధించింది.

తొలిసారి ఈ పదప్రయోగం
అంబేడ్కర్‌ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ ప్రకటనలో తొలిసారి ఈబీసీ పద ప్రయోగం చోటు చేసుకుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో 2014–15 నుంచి అమల్లోకి వచ్చిన డా.అంబేడ్కర్‌ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ ది ఇకనామికల్లీ బ్యాక్వర్డ్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌ అనే పథకంలో తొలిసారి ఆర్థికంగా వెనుకడిన వర్గం (ఈబీసీ) అనే పదం ఉపయోగించారు. జనరల్‌ కేటగిరీకి చెందిన విద్యార్థులకు ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారు. జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్‌ తన నివేదికను 2010లో సమర్పించాక ఈ స్కాలర్‌షిప్‌ పథకం అమలు మొదలైంది.

అమలు అంత తేలిక కాదు
ఈబీసీ కోటా అమలుకు లబ్ధిదారులను గుర్తించడం చాలా కష్టమని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ దళిత ఐఏఎస్‌ అధికారి చెప్పారు. ఈబీసీ అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించడం ద్వారా జనరల్‌ కేటగిరీని విభజించడం వల్ల ప్రయోజనం లేదన్నారు. కోటా విషయంలో ఓబీసీ(అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌)లను వర్గీకరించడానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిషన్‌ ఏడాదిన్నర దాటినా ఆ పని పూర్తి చేయలేదు. రిజర్వేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్పు చేయాలన్నా జాప్యం జరుగుతుందనడానికి ఇదే తార్కాణం.  

మతం ప్రాతిపదికన కోటా కుదరదు
జాతీయస్థాయిలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్‌కు అవకాశం లేకున్నా కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన మైనారిటీలకు కోటాలు ఇస్తున్నారు. అలాగే ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్రలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సగానికి మించి కోటా అవసరమని తగినన్ని సాక్ష్యాధారాలు అందజేస్తే అందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు 2010లో ప్రకటించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top