
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మరికొన్ని గంటలే గడువుండడంతో నగర ఎమ్మెల్యేల్లో ‘హై’ టెన్షన్ మొదలైంది. ఎవరికి వారు ప్రగతిభవన్ నుంచి వచ్చే పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉత్కంఠకు లోనవుతున్నారు. గడిచిన కేబినెట్‌లో నగరం నుంచి ఏకంగా నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. అయితే, మంగళవారం నాటి మంత్రివర్గ విస్తరణ పరిమితంగానే ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో కనీసం మరో ఇద్దరికైనా చాన్స్ దక్కుతుందని ఆశావహుల భావన. ప్రస్తుతం నగరానికి చెందిన ఎమ్మెల్సీ మహమూద్ అలీ మంత్రిగా పనిచేస్తుండగా, మంగళవారం నాటి విస్తరణపై ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, చామకూర మల్లారెడ్డి, దానం నాగేందర్, వివేకానంద్, అరికెపూడి గాంధీ పేర్లతో వివిధ రకాల కూర్పుల్లో చర్చకు వస్తున్నాయి.
ఒకవేళ పరిమిత సంఖ్యలో విస్తరణ జరిగితే ఒకరిద్దరికే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ‘వారు ఎవరన్న’ దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, రాష్ట్ర వ్యాప్త సామాజిక సమీకరణల్లో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బెర్త్ ఖాయమన్న వార్తల నేపథ్యంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు– కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌లో ఒకరు, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి– మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలో ఒకరికి మంత్రి పదవి లేదా అంతకు సమానమైన కేబినెట్ పదవి కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు ఆదివారం సాయంత్రం నుంచి వినిపిస్తున్నాయి. ఇక ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్ సైతం సామాజిక కోణంలో తనకూ అవకాశం వస్తున్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
మల్లారెడ్డికి ఏదో ఒక ఆఫర్!
మేడ్చల్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి మంత్రి వర్గంలో చాన్స్ దక్కకపోతే మరో అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ పదవి నుంచి ఎమ్మెల్యేకు వచ్చిన ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆయన్ను ఎమ్మెల్యేగానే పరిమితం చేస్తే, మల్లారెడ్డి సూచించే అభ్యర్థికి మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న నాయకుల్లో సీనియారిటీతో పాటు సమర్థత పరంగా కూడా మల్లారెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో ఆయన సేవలను విస్తృతంగా వాడుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.