కాంగ్రెస్‌కు బెహన్‌ భారీ షాక్‌

Mayawati Jolts Mahakutami Efforts In Chattisgarh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమితో ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించాలని సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి గట్టి షాక్‌ ఇచ్చారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత అజిత్‌ జోగితో ఎన్నికల పోరుకు బెహన్‌ మాయావతి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు చల్లారు. 90 స్ధానాలున్న చత్తీస్‌గఢ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 35 సీట్లు, అజిత్‌ జోగి సారథ్యంలోని చత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ 55 స్ధానాల్లో పోటీ చేసేలా అవగాహన కుదరడంతో షాక్‌ తినడం కాంగ్రెస్‌ వంతైంది.

పదిహేనేళ్ల బీజేపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలన్న కాంగ్రెస్‌ ఆశలకు మాయావతి గండికొట్టారు. దళిత ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు మాయావతితో పొత్తుకు బీజేపీ తహతహలాడినా ఆచరణలో వెనకబడటంతో సమయానుకూలంగా వ్యవహరించిన జోగి లాభపడ్డారు. ఇక రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని మాయావతి కాంగ్రెస్‌ ముందు భారీ డిమాండ్‌లను ఉంచారు. మోదీ హవాకు చెక్‌పెట్టి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలకు అధిక సీట్లను కట్టబెట్టేందుకు సిద్ధమైనా మాయావతి కోరినన్ని సీట్లు ఇస్తే కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top