
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర బడ్జెట్ తదనంతర పరిణామాలతో రాష్ట్ర ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారని, తాను కూడా గందరగోళంలో ఉన్నానన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కేంద్ర నిధుల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయండని రెండు ప్రభుత్వాలను అడగడమంటే మరింత కాలయాపన చేయడానికా, మిత్రపక్షాలను కాపాడటానికా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆదివారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఎంత పుచ్చుకున్నది? తనకు లెక్కలు చెప్పాలని కోరారు. వాటిలో వాస్తవాలేమిటో తన నిజ నిర్ధారణ కమిటీతో అధ్యయనం చేయిస్తానని ప్రకటించారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంత ఇచ్చామని కేంద్రం, కాదు ఇంతే పుచ్చుకున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నా.. ఇంకా లెక్కలు ఇవ్వండి నిజనిర్ధారణ కమిటీ చేత పరిశీలింపజేయిస్తానని పవన్ అనడమంటే కాలయాపన చేయడానికి మినహా మరొకటి కానేకాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అప్పుడే అడిగి ఉంటే..
విభజనానంతరం రాష్ట్రం నిలదొక్కుకోవాలన్నా, శాశ్వత అభివృద్ధికి అడుగులు పడాలన్నా, యువతకు భవిత ఉండాలన్నా ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్నా.. ప్రత్యేక ప్యాకేజీ పేరిట కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఇప్పటివరకు ఎందుకు నిలదీయలేకపోయారని పవన్‌ను పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నప్పుడే పవన్ ప్రశ్నించకపోవడంలోని ఔచిత్యం ఏంటో? వారి మధ్య ఉన్న అవగాహన ఏపాటిదో తెలిసిపోయిందని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి తీవ్రతను మీడియాతో సహా అన్ని వ్యవస్థలు.. పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ, కేంద్ర ప్రభుత్వం, తమ పార్టీకి చెందిన నాయకులు ఎత్తిచూపినప్పుడు పవన్‌కేమీ గుర్తుకు రాకపోవడం చిత్రంగా ఉందని బీజేపీ నాయకుడొకరు ఎద్దేవా చేశారు. ఇప్పుడు లెక్కలు అడగడం కన్నా పట్టిసీమలో అవినీతిని కాగ్ కడిగి పారేసినప్పుడే జనసేన అధ్యక్షుడు కనీసం ఒక్కమాటైనా ప్రశ్నించి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
రాజధాని ఏర్పాటు మొదలు అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు రైతులకు చేసిన, చేస్తున్న అన్యాయాల గురించి ఇలా వచ్చి అలా మాట్లాడి వెళ్లిపోయి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో అంతుబట్టడం లేదంటున్నారు. జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంపై చాలా సీరియస్ అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నంలలో జరిగిన అవినీతిని ఎక్కడైనా నిరూపిస్తానని ఉండవల్లి బహిరంగ సవాల్ విసిరారు. ముందుగా వాటిల్లోని వాస్తవాలేంటో పవన్ ఉండవల్లిని అడిగి తెలుసుకుంటే మంచిదని, అప్పుడు ఆయన మాట్లాడేదాన్ని బట్టి జనసేన నేత వాస్తవికత ఏంటో తేలిపోతుందని మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇరకాటంలో పడిన ప్రతిసారి పవన్ ప్రత్యక్షమవుతారని, అప్పటివరకు అజ్ఞాతంలో ఎక్కడ ఉంటారో కూడా తెలియదని మరో సీనియర్ నేత ఎద్దేవా చేశారు. మొన్నటికి మొన్న పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు చంద్రబాబు సర్కారు గతంలో ఎవరూ ఇవ్వని విధంగా ప్రత్యేక అనుమతులు ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకేనా!
‘తాజా ప్రజాగ్రహం చంద్రబాబు సర్కారుకు గట్టిగా తగిలింది. ప్రత్యేక హోదా వద్దని, అదేమీ సంజీవిని కాదని చంద్రబాబు అనడం ఎంత తప్పిదమో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తించారు. ప్రత్యేక ప్యాకేజీ రాక, కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మేర కేటాయింపులు జరగకపోవడంతో ఏమీ పాలుపోని పరిస్థితి. పోలవరం, రాజధానిలో జరిగిన అవినీతితో పాటు ఇతరత్రా లొసుగులన్నీ బట్టబయలు అవుతాయనే ఆందోళన చంద్రబాబులో తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రంగప్రవేశం చేసిన పవన్ వ్యూహం.. ప్రభుత్వంపై ఏర్పడు తున్న ప్రజావ్యతిరేకతను దారి మళ్లించడమే కావొచ్చని, గడచిన పరిణామాలను కూడా గమనిస్తే ఇదే అభిప్రాయం బలపడుతుంద’ని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.