మాకు మీరు .. మీకు మేము

Chandrababu inner agreements with Janasena and Congress - Sakshi

జనసేన, కాంగ్రెస్‌లతో చంద్రబాబు లోపాయికారీ ఒప్పందాలు

పవన్‌కల్యాణ్‌తో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో మంతనాలు

టీడీపీ తొలి జాబితాలో కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టిన చంద్రబాబు

మరోవైపు కొందరు కాంగ్రెస్‌ ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకొని వారికి టిక్కెట్లు

ఆ రెండు పార్టీలకు ఆర్థిక సాయం, అండదండలు అందించేలా ఒప్పందం

ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందేలా చంద్రబాబు వ్యూహం

సాక్షి, అమరావతి: గతంలో ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించిన చరిత్రలేని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో.. జనసేన, కాంగ్రెస్‌ పార్టీలతో కలసి సాగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈసారి ఆ పార్టీలతో బహిరంగంగా కాకుండా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని ఎన్నికల్లో గట్టెక్కాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు అనుగుణంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కి చెందిన ముఖ్య నేతలను నేరుగా తన పార్టీలోకి తీసుకున్నారు. వారిని టీడీపీ లోక్‌సభ స్థానాల అభ్యర్థులుగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశానికి లబ్ధి కలిగేలా జనసేన, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించేలా వ్యూహరచన చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో ఆ రెండు పార్టీలకు మేలు జరిగేలా టీడీపీ అభ్యర్థుల జాబితాను రూపొందిస్తున్నారు. 126 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఆ పార్టీ పోటీ చేయనున్న కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టడం గమనార్హమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 

జనసేనకు అనుకూలంగా..
విశాఖ జిల్లాలో గాజువాక, పెందుర్తి, భీమిలి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, పిఠాపురం, రంపచోడవరం స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించలేదు. పవన్‌ కల్యాణ్‌  గాజువాక, పెందుర్తి లేదా పిఠాపురంలలో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ స్థానాలకు చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదంటున్నారు. సీనియర్‌ నేత, వరుసగా గెలుస్తూ వస్తున్న బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి స్థానాన్ని సైతం చంద్రబాబు పెండింగ్‌లో పెట్టడం  లోపాయికారీ ఒప్పందంలో భాగమేనని అంటున్నారు. పవన్‌ ఒకవేళ గాజువాకలో పోటీకి దిగితే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు బదులు వేరొక డమ్మీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముందంటున్నారు. భీమిలి, పిఠాపురం స్థానాలనూ జనసేన కోసమే చంద్రబాబు ఆపారనే చర్చ నడుస్తోంది. జనసేనకు అనుకూలంగా ఉండేందుకే కృష్ణాజిల్లా పెడన అభ్యర్థిని కూడా ప్రకటించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీ సమీక్షల సందర్భంగా తిరుపతిలో ఎం.సుగుణమ్మపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలను ప్రస్తావిస్తూ పార్టీ నేతలకు చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత ఆమె పేరును అధికారికంగా ప్రకటించారు. సుగుణమ్మపై వ్యతిరేకత తిరుపతిలో జనసేనకు మేలు చేస్తుందని, లోపాయికారీగా ఇచ్చిపుచ్చుకొనే ఒడంబడికలో భాగంగానే ఆ స్థానాన్ని ప్రకటించారని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. అనంతపురంలో పోటీ చేస్తామని పవన్‌కల్యాణ్‌ తొలినుంచీ చెబుతున్నందుకే ఆ స్థానాన్ని కూడా చంద్రబాబు పెండింగ్‌లో ఉంచారన్న వాదన వినిపిస్తోంది. 

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే కుట్ర
బయటకు తమ మధ్య పొత్తులు లేవని ప్రకటిస్తూనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అంతర్గతంగా చెట్టపట్టాలు వేసుకొని వ్యూహాలు రచిస్తున్నట్లుగా ఆ రెండు పార్టీల తొలి జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు వీలుగా జనసేన  అభ్యర్థులను నిర్ణయించినట్లు కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు డైరక్షన్లోనే జనసేన జాబితా రూపొందిందని ఆ జాబితా చూస్తే స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఆరేడు నియోజకవర్గాల్లో కేవలం ఓట్లు చీలికే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించగా, మరికొన్ని స్థానాల్లో టీడీపీకి అనుకూలంగా పవన్‌  తన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. వీరికి కావలసిన ఆర్థిక సహకారం చంద్రబాబు అందించేలా ఒడంబడిక కుదిరిందని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ముఖ్య నేతలకు టీడీపీ సీట్లు
రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకోకున్నా లోపాయికారీగా కాంగ్రెస్‌ సహకారాన్ని తీసుకొనేందుకు చంద్రబాబు తెరవెనుక పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు కొందర్ని తెలుగుదేశంలో చేర్చుకుని టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దించడం, కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా చంద్రబాబు సూచించే అభ్యర్థులను కాంగ్రెస్‌ నిలబెట్టడం అన్న వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు టీడీపీ వర్గాలే వివరిస్తున్నాయి. వీరికి ఎన్నికల్లో అవసరమయ్యే ఆర్థిక సహకారాన్ని, ఇతర అండదండలను పూర్తిగా చంద్రబాబే అందించేలా ఒప్పందం కుదిరిందని అంటున్నారు. విజయనగరం జిల్లా నుంచి మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్‌ను, కర్నూలు జిల్లానుంచి మరో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిలు ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. వీరిద్దరికీ టీడీపీ లోక్‌సభ టిక్కెట్లను దాదాపుగా ఖరారు చేసింది. ఇదేవిధంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని కూడా టీడీపీలోకి తీసుకొని ఆమెకు లోక్‌సభ టిక్కెట్టు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ స్థానాల విషయంలోనూ కాంగ్రెస్‌ నుంచి తనకు సహకారం అందేలా బాబు ప్రణాళికలు వేస్తున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

జనసేన, బీఎస్పీ పొత్తు వెనుక బాబు వ్యూహం
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా ప్రత్యేకించి ఆ ఓట్లేవీ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు మరో ఎత్తుగడ వేశారు. వైఎస్సార్‌సీపీకి పూర్తి అనుకూలంగా ఉన్న దళిత, బడుగు, బలహీనవర్గాల ఓట్లను చీల్చేందుకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, పవన్‌కల్యాణ్‌ల మధ్య ఒక అవగాహన కుదిరేలా చంద్రబాబు మంత్రాంగం నడిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ గాలి జోరుగా వీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును   చీలేలా చంద్రబాబు వ్యూహం రచించారు. శుక్రవారం జనసేన, బీఎస్పీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. కాగా ఇది చంద్రబాబు ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి పవన్‌కల్యాణ్‌ రెండు నెలల క్రితమే బీఎస్పీతో పొత్తు కోసం లక్నో వెళ్లారు. కానీ మాయావతితో సమావేశం జరగలేదు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం, వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమైన పరిస్థితుల్లో చంద్రబాబు మాయావతిని ఫోన్లో సంప్రదించారు. జనసేనతో బీఎస్పీ పొత్తుకు వీలుగా పావులు కదిపారు. పవన్‌కల్యాణ్‌ను ఆగమేఘాలపై లక్నో పంపించారని టీడీపీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు పోకుండా బీఎస్పీ, జనసేనలకు పడితే టీడీపీ లాభపడుతుందనేది చంద్రబాబు ఎత్తుగడగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top