పేద బ్రాహ్మణులకు అండగా కేసీఆర్‌ ప్రభుత్వం

KTR meets Brahmana Sangam leaders - Sakshi

గతేడాది వారి కోసం 17 కొత్త పథకాలు ప్రవేశపెట్టాం

బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి కేటీఆర్‌  

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం పేద బ్రాహ్మణులకు అండగా ఉంటుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. బ్రాహ్మణుల స్థితిగతులపై సీఎంకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. గురువారం నెక్లెస్‌ రోడ్‌లోని వండర్‌ ఫన్‌ పార్కులో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం 2017–18లో 17 కొత్త పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు గతంలో రూ.5 వేలు జీతం ఉండగా.. ఇప్పుడు రూ.25 నుంచి రూ.50 వేల వరకు ట్రెజరీల ద్వారా పొందుతున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేనట్లుగా దేవాలయాల అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు కేసీఆర్‌ విడుదల చేశారని గుర్తు చేశారు. యాదాద్రి, వేములవాడ, ధర్మపురి, బాసర, భద్రాచలం లాంటి ఆలయాలను ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక కామన్‌గుడ్‌ ఫండ్‌ చాలా తక్కువగా ఉండగా సీఎం రూ.250 కోట్లు కేటాయించి 269 దేవాలయాల పునరుద్ధరణ చేశారన్నారు. గతంలో 1,800 దేవాలయాలకే ధూపదీప నైవేధ్యాలు అందిస్తుండగా మరో 200 ఆలయాలను ఇందులో చేర్చామని, మరో 1,200 ఆలయాలకు త్వరలో దీన్ని వర్తింప చేయనున్నట్లు చెప్పారు.

  ఇటీవల వరంగల్‌లో దుండగుల దాడిలో మరణించిన అర్చకుడు సత్యనారాయణ శర్మకు కనీసం నివాళులు కూడా అర్పించలేదంటూ ఇద్దరు వ్యక్తులు నినాదాలు చేశారు. మంత్రి స్పందిస్తూ సత్యనారాయణ శర్మ కుటుంబాన్ని ఆదుకోవడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవి ప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మృత్యుంజయ శర్మ, కార్పొరేటర్‌ నరేంద్రచారి, ఆయాచితం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు ఇక్కడేం పని..
ఆంధ్రప్రదేశ్‌లో చేయాల్సిన పనులన్నీ వదిలి చంద్రబాబు ఇక్కడేం చేస్తున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. గతంలో ధర్మపురి గోదావరి పుష్కరాలకు వచ్చిన చంద్రబాబు నెత్తిపై నీళ్లు చల్లుకుంటుంటే అక్కడ బ్రాహ్మణులు నీళ్లలో మునగాలని ఆయనకు చెప్పారని, అయితే పక్కనున్న ఆయన సహాయకుడు సార్‌(చంద్రబాబు)కు ముంచుడు తప్ప.. మునగడం తెలియదన్నారని కేటీఆర్‌ చమత్కరించారు.

‘బ్రాహ్మణుల ఓట్లు టీఆర్‌ఎస్‌కు వేయిద్దాం’
బ్రాహ్మణులందరూ ఒక్కతాటిపై ఉండి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. మతైక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నల్లకుంట రామాలయ అర్చకుడు గంగు భానుమూర్తి మాట్లాడుతూ అర్చక, ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌కు రుణపడి ఉంటాయని తెలిపారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top