జ్వరంతో ప్రగతి భవన్‌లోనే కేటీఆర్‌!

KTR Birth day celebrations across Telangana - Sakshi

ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఫీవర్ కారణంగా వేడుకలకు దూరంగా ఉన్న కేటీఆర్

ట్వీట్ల ద్వారానే అందరికీ సమాధానాలు

పలుచోట్ల సేవాకార్యక్రమాలు చేపట్టిన నేతలు

కేటీఆర్ రియల్  హీరో అంటూ ఎంపీ కవిత ట్వీట్

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జ్వరం కారణంగా ప్రగతి భవన్‌కే పరిమితమైన కేటీఆర్‌కు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్ల ద్వారానే కేటీఆర్‌ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పలుచోట్ల నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన అన్న రియల్ హీరో అంటూ ఎంపీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.

గతంతో పోలిస్తే ఈసారి ఫ్లెక్సీలు కటౌట్లు ఎక్కడా కనిపించలేదు. ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకూడదని  మంత్రి కేటీఆర్ స్వయంగా ఆదేశించడంతో హైదరాబాదులో ఆ హడావిడి కనిపించలేదు. మంత్రులు, పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా హరితహారం నిర్వహించి బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు.

హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ సూచించిన నేపథ్యంలో నేతలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . కొందరు మంత్రులు మాత్రం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రెండ్రోజులుగా జ్వరంగా ఉందని విషెస్ చెప్పడానికి ఎవరూ రావద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి హరీష్‌రావు చెప్పిన జన్మదిన శుభాకాంక్షలకు.. థాంక్యూ బావా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ఇతర పార్టీల నేతలు, జాతీయ నేతలు కూడా  కేటీఆర్‌కు ట్విటర్‌లోనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ట్వటర్‌ వేదికగా కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

అన్న కేటీఆర్ గురించి ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు చెప్తూనే నిజజీవితంలో హీరోలు ఉండరని ఎవరైనా అంటే తాను ఒప్పుకోనని.. తన అన్నను చూపిస్తానని కవిత ట్వీట్ చేశారు. అభిమానులు చేసిన ట్వీట్లకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top