‘సాగర్‌’ నుంచే మనకు అన్యాయం

KCR Speech At Nalgonda Meeting - Sakshi

నల్లగొండ ఆశీర్వాద సభలో కేసీఆర్‌

ప్రాజెక్టును కట్టాల్సిన చోట నిర్మించలేదు.. తెలంగాణ కేటాయింపులను తగ్గించారు

గులాముల వల్ల తెలంగాణ ప్రజల బతుకులు ఆగమయ్యాయి

నల్లగొండతో నాకు ఉద్వేగపూరిత బంధం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏమీ తెలియదు

దామరచర్లలో అతిపెద్ద పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం మేమే చేపట్టాం

నల్లగొండ, సాక్షి ప్రతినిధి : ‘పోరాటాల పురిటిగడ్డ.. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమైనా, తెలంగాణ ఉద్యమమైనా పిడికిలి బిగించి చైతన్యాన్ని కలిగించిన నల్లగొండ ప్రజానీకం ఈ ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని కోరు తున్నా. నల్లగొండతో నాకు ఉద్వేగపూరిత సంబం ధం ఉంది. అనేక ఉద్యమాల్లో భాగంగా కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర కావచ్చు... ఫ్లోరైడ్‌ సమస్య మీద 8 రోజులు ఇదే జిల్లాలో మకాం వేసి అనేక సభల్లో ఇక్కడ మాట్లాడా’ అని సీఎం కేసీఆర్‌ గురువారం నల్లగొండ ఆశీర్వాద సభలో ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్నారు. అలాగే తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...

కాంగ్రెస్‌ది చారిత్రక ద్రోహం...
కాంగ్రెస్‌ నాయకులు ఈ రాష్ట్రానికి పెద్ద శాపం. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం నుంచే మనకు అన్యాయం జరిగింది. వాస్తవానికి సాగర్‌ను ఇప్పుడున్న చోటు నుంచి 19 కిలోమీటర్ల పైన ఏలేశ్వర వద్ద కట్టాలి. అది డిజైన్‌ చేసినప్పుడు 180 టీఎంసీలు తెలంగాణకు, 60 టీఎంసీలు ఏపీకి చేసిండ్రు. కానీ నెహ్రూను, ఢిల్లీ కాంగ్రెస్‌ను చూడగానే మన తెలంగాణ కాంగ్రెస్‌కు 1952 నుంచి నేటి వరకు లాగులు తడుస్తాయి. 180 టీఎంసీలు మనకు ఉంటే దాన్ని 130 టీఎంసీలు అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మూతి ముడుచుకున్నడు. నెహ్రూ శంకుస్థాపన చేస్తే గుడ్డిగా ఆమోదించిండు. తెలంగాణ కాంగ్రెస్‌ చారిత్రకంగా తెలంగాణకు చేసిన ద్రోహం ఇది.

గులాబీ జెండాతోనే తెలంగాణ.. 
2001లో ఎగిరిన గులాబీ జెండాతో నేడు తెలంగాణ సాధ్యమైంది. మడమ తిప్పను.. ఎత్తిన జెండా దిం చను. ఒకవేళ మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమన్న. మీరందరూ నా మీద విశ్వాసం ఉంచి 14 ఏళ్లు నిరంతరం పోరాడి.. విమర్శలు, అవమా నాలు దిగమింగారు. పటిష్ట పోరాటంతో తెలంగాణ వచ్చింది. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు స్థానమే లేదు అని చెప్పిన చోట 12 స్థానాలకుగాను టీఆర్‌ ఎస్‌ను 6 స్థానాల్లో గెలిపించారు. అధికారంలో కొచ్చా క రాష్ట్రంలో కరెంట్‌ సమస్య పరిష్కారానికి ప్రాధాన్య తనిచ్చాం. ఈ రోజు ఇండియాలో రెప్ప పాటు కరెంట్‌ పోకుండా 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఉచిత కరెంట్‌ దేశంలో ఇస్తుంది తెలంగాణ ఒక్కటే. మంచినీళ్ల కోసం పెట్టిన మిషన్‌ భగీరథ పథకం జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, నదులు, వాగులు, రోడ్లు, కాలువలు దాటు కుంటా రావాలి. 90% పనులు పూర్తయ్యాయి. ఇం టింటికీ నల్లానీరు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగు తోంది. రాబోయే రెండు నెలల్లో ఈ కార్యక్రమం సఫలం కాబోతోంది.

ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులు, వీఏఓలు, కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సగం కడుపుతో పనిచేసుకుంటూ వచ్చా రు. వారందరికీ గౌరవప్రద వేతనాలు పెంచాం. రూ. 200 పింఛన్లను రూ. వెయ్యి చేశాం. ఇంకా పెంచా లనుకుంటున్నాం. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్స్‌ ఇచ్చాం. సన్నబియ్యంతో పిల్లలకు అన్నం పెట్టుకున్నాం. ఇవన్నీ మీ కళ్ల ముందు ఉన్నా యి. రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం. భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం. రైతులకు నీటి తీరువా పన్ను రద్దు చేశాం. గోదాముల సామర్థ్యాన్ని 4 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 23 లక్షల టన్నులకు తీసుకొచ్చాం. పంటలకు గిట్టుబాటు ధర అందిం చేలా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో పండించిన పంట ఎక్కడ అమ్ము కోవాలనే బాధ లేకుండా ప్రతి తాలూకాకు ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం.

ఎస్‌ఎల్‌బీసీని ఆగం చేసిండ్రు..
ఎస్‌ఎల్‌బీసీ సోరంగాన్ని ఆగం పట్టించిండ్రు. 2002 చంద్రబాబు హయాంలో కుడి కాలువ మీద ఉన్న ఎత్తిపోతలకు ప్రభుత్వమే విద్యుత్‌ బిల్లులు చెల్లించింది. కానీ ఎడమ కాలువ మీద ఉన్న ఎత్తిపోతలకు చెల్లించలేదు. దీన్ని చంద్రబాబు  వద్దకు తీసుకెళ్తే అప్పుడు ఎడమ కావుల మీద ఉన్న ఎత్తిపోతలకు కూడా బిల్లులు చెల్లించిండ్రు. ఎన్నో అరాచకాలు జరిగినా కాంగ్రెస్, టీడీపీ నోరు తెరవలేదు. వీళ్లేమో ఢిల్లీ గులాములు.. వాళ్లేమో చంద్రబాబు గులాములు. ఈ గులాముల వల్ల తెలంగాణ ప్రజల బతుకులు ఆగమయ్యాయి.

పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ అంటే కాంగ్రేసోళ్లు పారిపోయిండ్రు..
కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే విధంగా ఖమ్మంలో సీతారామ, మహబూబ్‌నగర్‌లో పాలమూరు, డిండి పథకం, కాళేశ్వరం, దేవాదుల పూర్తి చేసేం దుకు ప్రాజెక్టులు రీ డిజైన్‌ చేశాం. దీనిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తానన్నా. వివరిస్తానంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులు మీ జిల్లాలో ఉన్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేష న్‌ను కాంగ్రెస్‌ బాయ్‌కాట్‌ చేసింది. మీ జిల్లాలోని టీ.పీసీసీ అధ్యక్షుడికి ఏమీ తెలియదు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ వస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేను ప్రిపేర్‌ కాలేదని తోకమూడుచుకొని పోయిండు. ఉత్తమ్, జానా, వెంకట్‌రెడ్డిలు నల్లగొండలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టమని అడగకున్నా దక్షిణ తెలంగాణలో కృష్ణా నది సమీపాన దామరచర్ల వద్ద 29,965 కోట్ల పెట్టుబడితో 4 వేల మెగావాట్ల అల్ట్రామెగా పవర్‌ ప్లాంట్‌ను మా ప్రభుత్వం నిర్మిస్తోంది. రెండేళ్లలో ఇక్కడ విద్యుత్‌ అందు బాటులోకి వస్తుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు రూ.1100 కోట్లు కేటాయించాం. ఈ కాలువలకు మరమ్మతులు చేయించాం. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో ఇప్పుడు ఈ కాలువల్లో వస్తున్న నీళ్లతో చెరువు నింపమన్నాం. ఇక్కడ ఫ్లోరైడ్‌తో 1.50 లక్షల మంది నాశనం అయ్యారు.. దీనికి ఎవరు కారణం. రాష్ట్రాన్ని గతంలో పాలించిన పాలకులు కాదా..? మిషన్‌ భగీరథ పెడితే దాని మీద కోర్టుకు వెళతారు. 1956 నుంచి కాంగ్రెస్‌ తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉంది. 

కాంగ్రెసోళ్లు గొర్రెల్లా మాట్లాడారు..
తెలంగాణలో హైదరాబాద్‌తో సహా నిత్యం 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. గొల్లకుర్మలు రాష్ట్రంలో 35 లక్షల మంది ఉన్నారు. దాన్ని గమనించి 65 లక్షల గొర్రెలు ఇచ్చాం. వాటికి 35 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయి. గొర్రెలేనా.. బర్రెలేనా అని కాంగ్రె సోళ్లు మాట్లాడారు. మీరు గొర్రెల్లా ఉండబట్టే 35 లక్షల మంది యాదవులు ఉన్న రాష్ట్రంలో 650 లారీల గొర్రెలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. గొల్లకుర్మ సోదరులే వాళ్లకు బుద్ధి చెప్పాలి. మత్స్యకారులను దెబ్బతీశారు. పోచంపల్లి, గద్వాల, దుబ్బాక, సిరిసిల్ల, భవన గిరి ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు ఇచ్చాం. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు కల్లు దుకాణాలు మూసివేశారు. మేము వచ్చిన తర్వాత వాటిని తెరిపించాం. వాళ్లు చెల్లించే చెట్ల పన్ను శాశ్వతంగా ఎత్తి వేశాం. ఎంబీసీల కోసం రూ.వెయ్యి కోట్లు ఇచ్చాం. కోటి ఎకరాలకు నీళ్లు రావాలని కార్యక్రమాలు చేపడితే.. అడ్డుపడుతున్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top