సామాజిక సమీకరణలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ లెక్కలు

KCR May Announce New Cabinets In TRS Cabinet - Sakshi

గత ప్రభుత్వంలో 11 మంది ఓసీలు

ఈసారి బీసీలకు స్వల్పంగా పెంపు!

మంత్రివర్గం ఏర్పాటు ఆలస్యం

దీంతో పెరుగుతున్న ఆశావహులు

ఈ నెల 20 వరకే మంచి రోజులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కొత్త మంత్రివర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన జట్టులో ఎవరిని చేర్చుకుంటారనే ఆసక్తి పెరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఒకింత ఆలస్యమవుతుండటంతో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నెల 20 వరకే మంచి రోజులు ఉన్న నేపథ్యంలో అప్పటిలోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ సోమవారం (17న) బాధ్యతలు చేపడుతున్నారు. దీంతో ఆరోజు మంత్రివర్గ విస్తరణ ఉండబోదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18న మంత్రుల ప్రమాణ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఆ రోజు కాకుంటే బుధ, గురువారాల్లో నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రికార్డు స్థాయిలో 88 స్థానాల్లో విజయం సాధించింది.

కొత్త ఎమ్మెల్యేలలో అత్యధికులు రెండు, అంత కంటే ఎక్కువసార్లు గెలిచిన వారే ఉన్నారు. దీంతో మంత్రి పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మంత్రి పదవులను ఆశించే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. మనసులోని కోరికను నేరుగా చెప్పలేకపోయినా... అంతరంగం తెలిసేలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ గతంలో ఏదైనా సందర్భాల్లో తమకు కీలక బాధ్యతలు ఇస్తానని చేసిన ప్రకటనలు గుర్తుకు వచ్చేలా చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలసి నేరుగా తమ మనసులోని కోరికను చెబుతున్నారు. సీఎంకు చెప్పి మంత్రివర్గంలో చోటు కల్పించేలా చేయాలని కోరుతున్నారు.

‘సామాజిక’మార్పులు..
కేసీఆర్‌ గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ ఒక్కరే ఆ రోజు మంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు ఉండవచ్చు. మహమూద్‌అలీ మంత్రిగా ఉన్నందున మరో 16 మందికి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో తుమ్మల నాగేశ్వర్‌రావు (కమ్మ), అజ్మీర్‌ చందూలాల్‌ (ఎస్టీ), జూపల్లి కృష్ణారావు (వెలమ), పట్నం మహేందర్‌రెడ్డి (రెడ్డి) ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో వీరి స్థానాల్లో కచ్చితంగా కొత్త వారికి అవకాశం కల్పించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో 11 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ.. మంత్రివర్గంలో ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణల పరంగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓసీల సంఖ్యను తగ్గించి బీసీల సంఖ్య పెంచేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవులను ఎవరికి ఖరారు చేస్తారనే విషయంలో స్పష్టత వచ్చాకే మంత్రివర్గంలో సామాజిక సమీకరణల లెక్కలు తేలనున్నాయి.

స్పీకర్‌గా ఓసీ సామాజికవర్గం వారికి అవకాశం ఇస్తే ఈ మేరకు మంత్రివర్గంలో వీరి సంఖ్య తగ్గనుంది. ఎస్సీ వర్గంలో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎస్సీ కోటాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు మాదిగ వర్గానికి చెందిన అరూరి రమేశ్‌ (వర్ధన్నపేట), రసమయి బాలకిషన్‌ (మానకొండూరు) మాల వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి), బాల్క సుమన్‌ (చెన్నూరు) పేర్లను కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. మాదిగ, మాల వర్గాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, అజ్మీర రేఖానాయక్‌ల్లో మహిళా కోటాలో ఒకరికి చోటు కల్పించే అవకాశం ఉంది. బీసీలో మున్నూరుకాపు ఎమ్మెల్యేల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఈ వర్గానికి చెందిన జోగు రామన్న, దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, గంగుల కమలాకర్, దాస్యం వినయభాస్కర్‌లు ఉన్నారు.

స్పీకర్‌గా ఎవరు...  
కీలకమైన శాసనసభ స్పీకర్‌ పదవి ఎవరికి ఇస్తారనేది టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలకు టెన్షన్‌గా మారింది. స్పీకర్‌గా వ్యవహరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరికొండ మధుసూదనచారి (భూపాలపల్లిలో) పరాజయం పాలయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్‌గా పని చేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేకపోవడంతో దాదాపు అందరు ఈ పదవిపై ఆసక్తి చూపడంలేదు. పైగా స్పీకర్‌ పదవి వద్దని చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో సీనియర్లు అయిన ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ పేర్లను స్పీకర్‌ పదవి కోసం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. స్పీకర్‌ పదవిని ఓసీ వర్గం వారికి ఇస్తే డిప్యూటీ స్పీకర్‌ పోస్టును బీసీ లేదా ఎస్టీలకు ఇచ్చే అవకాశం ఉంది.  

సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవుల ప్రాబబుల్స్‌...
రెడ్డి: నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగడి సునీత, వేముల ప్రశాంత్‌రెడ్డి, సిహెచ్‌.మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి.
వెలమ: తన్నీరు హరీశ్‌రావు, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు
కమ్మ: కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్‌కుమార్, అరికెపూడి గాంధీ.
బీసీ: ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్, జోగు రామన్న, దానం నాగేందర్, గంగుల కమలాకర్, దాస్యం వినయభాస్కర్, బాజిరెడ్డి గోవర్ధన్, వి.శ్రీనివాస్‌గౌడ్, కె.పి.వివేకానందగౌడ్‌.
ఎస్సీ: కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, అరూరి రమేశ్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్‌.  
ఎస్టీ: డి.ఎస్‌. రెడ్యానాయక్, అజ్మీర రేఖానాయక్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top