కేసీఆర్‌ను మించిన లౌకికవాది లేరు

KCR is a great secularist says KTR - Sakshi

     సిద్ధిపేటలో ఇక్బాల్‌ మినార్‌ కట్టించారు: కేటీఆర్‌ 

     వంద సీట్లతో మరోసారి సీఎం అవుతారు... టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నేతలు అబిద్, ఖలీల్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించిన లౌకికవాది లేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎక్కడాలేని విధంగా మొట్టమొదట సిద్దిపేటలో ఇక్బాల్‌ మినార్‌ కట్టించారని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వంద సీట్లతో గెలిచి కేసీఆర్‌ మరోసారి సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అబిద్‌ రసూల్‌ఖాన్, ఖలీల్‌ ఉర్‌ రెహమాన్, వారి అనుచరులు తెలంగాణ భవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అబిద్‌ రసూల్‌ఖాన్, ఖలీల్‌ రెహమాన్‌ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య స్నేహం ఉందని ఆరోపిస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్‌ మైనారిటీ నేతలు తమ పార్టీలో చేరి చెంప చెళ్లుమనిపించారని అన్నారు. 

టీఆర్‌ఎస్‌ మంచి పార్టీ: మహమూద్‌అలీ 
టీఆర్‌ఎస్‌ అంతటి మంచి పార్టీ దేశంలోనే లేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సీఎం కేసీఆర్‌ ముస్లింలను కంటికి రెప్పలా కాపాడుతున్నారని, ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. 

కాంగ్రెస్‌ జోకర్ల పార్టీ: రసూల్‌ఖాన్‌ 
కాంగ్రెస్‌ జోకర్ల పార్టీగా మారిందని అబిద్‌ రసూల్‌ఖాన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో పనిచేస్తోందన్నారు. ముస్లింలు ఎన్నికల్లో గెలవరని కాంగ్రెస్‌ వారికి టికెట్లు ఇవ్వట్లేదని, క్రిమినల్‌ కేసులు ఉన్న వారికే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను స్వాహా చేసిన షబ్బీర్‌అలీకి కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. త్వరలోనే షబ్బీర్‌ బండారం బయట పెడతానని చెప్పారు. 

కాంగ్రెస్‌లో బౌన్సర్లే మిగిలారు: దానం నాగేందర్‌ 
కాంగ్రెస్‌లో ఎవరికీ న్యాయం జరగలేదని ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ అన్నారు. గాంధీభవన్‌ నుంచి కార్యకర్తలను బయటికి పంపారని, ఆ పార్టీలో బౌన్సర్లే మిగిలారన్నారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు.

రాష్ట్రాన్ని అమ్ముకుంటారు: కేటీఆర్‌
తెలంగాణభవన్‌లో రోజూ వేలాది మందితో చేరికలు జరుగుతుంటే గాంధీభవన్‌ గేట్లకు తాళాలు వేశారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. టికెట్ల పంపిణీ సమయంలో గాంధీభవన్‌ దగ్గర, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి దగ్గర బౌన్సర్లే ఉంటున్నారని చెప్పారు. రూ.3 కోట్లకు టికెట్‌ అమ్ముకుంటున్నవారు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకోరా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను చంద్రబాబుకు అమ్ముకోరనే గ్యారంటీ ఉందా అన్నారు. కోదాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొల్లం మల్లయ్యయాదవ్, తన అనుచరులతో కలసి తెలంగాణభవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ పార్టీ కండువా కప్పి వారిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ‘రాహుల్‌ గాంధీ స్వయంగా పంపిన కాంగ్రెస్‌ నేత రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారని 30 ఏళ్లు ఆ పార్టీలో పనిచేసిన బడుగువర్గాల నేతలు ఆరోపించారు. వారి టికెట్లు ఢిల్లీ, అమరావతిలో ఖరారయ్యాయి.

కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. నెలన్నరకు ఒక్కరు చొప్పున పంచుకుంటారు. సీల్డు కవర్‌ సీఎం కావాలా? సింహం లాంటి కేసీఆర్‌ కావాలా? 67 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనను, నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనను పోల్చుకొని ఓటేయండి. మహాకూటమితో మల్లయ్యయాదవ్‌కు అన్యాయం జరిగింది. కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి తాను బలహీనవర్గాల గొం తుకగా ఉంటానని మల్లయ్యయాదవ్‌కు భరోసా ఇచ్చారు. కోదాడలో గులాబీ జెండా ఎగరాలి. కోదాడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు ఒకే వేదిక మీదున్నారు. అందరూ కలసికట్టుగా కోదాడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాలి’అని పిలుపునిచ్చారు.  

ఉత్తమ్‌ భార్యకు ఎలా టికెట్‌ ఇప్పించుకున్నారు: కవిత
టీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీ అని విమర్శించే ఉత్తమ్‌ ఆయన భార్యకు టికెట్‌ ఎలా తీసుకుంటారని ఎంపీ కవిత ప్రశ్నించారు. ఉత్తమ్‌ తన భార్యకు టికెట్‌ ఉపసంహరించుకోవాలని, అప్పుడైనా ఆయనకు గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో విలేకరులతో కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కోదాడలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు కొత్తగా సెటిలర్లపై ప్రేమ పుట్టుకొచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో కమ్మ వర్గానికి అన్యాయం జరిగిందని, రేణుకాచౌదరి ఆ పార్టీకి రాజీనామా చేస్తారని వింటున్నానని చెప్పారు. సెటిలర్ల్లంతా టీఆర్‌ఎస్‌వైపే ఉంటారన్నారు. టీఆర్‌ఎస్‌ వందకుపైగా స్థానాలు గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరిస్తారన్నారు. జగిత్యాల స్థానాన్ని గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకుంటామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top