కర్ణాటకంపై విదేశీ మీడియా..

Karnataka Outcome Highlights Key Risk For PM Modi - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై విదేశీ మీడియా మిశ్రమంగా స్పందించింది. 224 అసెంబ్లీ స్ధానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ 104 స్ధానాలు సాధించినా మేజిక్‌ ఫిగర్‌కు కొద్దిదూరంలో ఆగిపోయింది. గవర్నర్‌ ఆహ్వానం మేరకు బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో బలనిరూపణలో గట్టెక్కుతారని విదేశీ మీడియా అంచనా వేసింది. కోర్టు తీర్పులు, ఎమ్మెల్యేల బేరసారాల మధ్య బీజేపీ సర్కార్‌ కొలువుతీరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పగ్గాలు ఎవరు చేపడతారన్నది పక్కనపెడితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన స్ఫూర్తిని ఇచ్చాయని, బీజేపీ ఇప్పటికీ ప్రజల్లో ప్రతిష్ట కలిగిఉందని, రాజకీయ వ్యూహాల్లోనూ ఆరితేరిందని నిరూపించుకుందని రాజకీయ విశ్లేషణ సంస్థ యురేసియా గ్రూప్‌ ఆసియా డైరెక్టర్‌ శైలేష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

బీజేపీ శాసనసభలో బలనిరూపణ చేసుకుంటుందని తాము అంచనా వేస్తున్నామన్నారు.  సంప్రదాయంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో పట్టున్న బీజేపీ దక్షిణాదిన కర్ణాటకలో మెరుగైన సామర్థ్యం కనబరచడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి సవాల్‌ విసిరిందని కుమార్‌ అన్నారు. కర్ణాటకలో సాధారణ మెజారిటీ సాధిస్తే బీజేపీ ఇంకా బలపడేదని విశ్లేషించారు. ఇక 78 అసెంబ్లీ స్ధానాలు సాధించిన కాంగ్రెస్‌, 37 స్ధానాలు గెలుచుకున్న జేడీ(ఎస్‌) కూటమి ప్రభుత్వం కోసం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వ్యూహాలు రచించాయి.

మోదీకి కర్ణాటక రిస్క్‌
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితలు ప్రధాని నరేంద్ర మోదీకి కీలక సవాల్‌గా విదేశీ మీడియా అభివర్ణించింది. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి 2015 బిహార్‌ ఎన్నికల తరహాలో జట్టుకడితే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని కన్సల్టెన్సీ సంస్థ కంటోల్‌ రిస్క్స్‌ ఇండియా, దక్షిణాసియా అసోసియేట్‌ డైరెక్టర్‌ ప్రత్యూష్‌ రావ్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top