గవర్నర్ X ముఖ్యమంత్రి

Karnataka CM ignores governor's deadlines to prove majority - Sakshi

బలనిరూపణపై గవర్నర్‌ ఆదేశాలను ధిక్కరించిన కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్‌‡రమేశ్‌

గవర్నర్‌ శాసన వ్యవస్థకు అంబుడ్స్‌మన్‌ కాదని సీఎం మండిపాటు

‘రెబెల్స్‌’ తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్లిన సీఎం కుమారస్వామి, కాంగ్రెస్‌  

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం శుక్రవారం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్‌ వజూభాయ్‌వాలా రెండుసార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురవుతున్నట్లు గవర్నర్‌కు ఇప్పుడే జ్ఞానోదయమైందని కుమారస్వామి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వజూభాయ్‌వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఆయనేమీ శాసనవ్యవస్థకు అంబుడ్స్‌మన్‌ కాదని చురకలు అంటించారు. బల నిరూపణపై గవర్నర్‌ రాసిన రెండు లేఖలను ‘లవ్‌ లెటర్స్‌’గా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. జూలై 22న విశ్వాసపరీక్షపై తప్పనిసరిగా ఓటింగ్‌ నిర్వహిస్తామనీ, ఇక ఆలస్యం చేయబోమని చెబుతూ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.

బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం..
విధానసౌధ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ కోల్పోయిందని తెలిపారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వాసపరీక్షపై ఓటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటే రూ.40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అస్థిరపరిచే ప్రక్రియ సాగుతోంది. 14 నెలల తర్వాత ఇప్పుడది చివరిదశకు చేరుకుంది. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని నాకు ముందే తెలుసు.కాబట్టి విశ్వాసపరీక్ష విషయంలో మనం నిదానంగా చర్చిద్దాం. సోమవారం లేదా మంగళవారం కూడా విశ్వాసపరీక్షను చేపట్టవచ్చు. మీరు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఇబ్బందేమీ లేదు. మీకిప్పుడు మద్దతు తెలిపిన రెబెల్స్‌ అండతో మీ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంతకాలం అధికారంలో ఉంటుందో నేనూ చూస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కావడంతో గవర్నర్‌ ఆదేశాల మేరకు విశ్వాసపరీక్ష డివిజన్‌ నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. అయితే నిబంధనల మేరకు విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాకే ఓటింగ్‌ జరగాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగగా, పోటీగా కాంగ్రెస్‌ సభ్యులు బీజేపీకి, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ రమేశ్‌ అసెంబ్లీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదావేశారు.

నిమ్మకాయ ఉంటే చేతబడేనా?
ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి రావడంతో రగడ మొదలైంది. ప్రభుత్వ మనుగడ కోసమే ఆయన చేతబడి చేయించిన నిమ్మకాయతో వచ్చారని కొందరు బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కుమారస్వామి వెంటనే స్పందిస్తూ..‘నిమ్మకాయను తెచ్చుకున్నందుకు మీరంతా రేవణ్ణను నిందిస్తున్నారు. మీరు హిందూ సంస్కృతిని గౌరవిస్తామంటూనే, ఆయన్ను అవమానిస్తున్నారు. రేవణ్ణ ఆలయాలకు వెళతారు. వెంట నిమ్మకాయను ఉంచుకుంటారు. కానీ మీరుమాత్రం ఆయన చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు. చేతబడులతో అసలు ఎక్కడైనా ప్రభుత్వాలు నిలుస్తాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని జిల్లాలకు నిధులు కేటాయించినా, బీజేపీ మాత్రం తనను 2–3 జిల్లాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. గవర్నర్‌ ఇచ్చిన రెండో గడువు దాటిపోతున్న సమయంలో బీజేపీ నేత సురేష్‌ కుమార్‌ విశ్వాసపరీక్ష ఓటింగ్‌ చేపట్టాలని కోరారు. తాను చెప్పాల్సింది చెప్పేశాననీ, ఇంకేమైనా ఉంటే సోమవారం చూసుకుందామని కుమారస్వామి అన్నారు. దీంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు.

రెబెల్స్‌ను హోటల్‌లో బంధించారు: శివకుమార్‌  
కాంగ్రెస్‌–జేడీఎస్‌ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలను ముంబైలోని రినైసెన్స్‌ హోటల్‌లో బంధించారని మంత్రి డి.కె.శివకుమార్‌ అసెంబ్లీలో ఆరోపించారు. ‘మమ్మల్ని బంధించారు.. కాపాడండి అని రెబెల్‌ ఎమ్మెల్యేల నుంచి సీఎం కుమారస్వామికి ఫోన్‌ వచ్చింది. అందుకే మేం ముంబై వెళ్లాం. తొలుత కుమారస్వామి స్వయంగా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం అలా వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వారించారు. ఈ నేపథ్యంలో మేం సదరు హోటల్‌లో గదిని బుక్‌ చేశాం’ అని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు, వారి కుటుం సభ్యులెవరూ సాయం కోసం తనను సంప్రదించలేదని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మరోవైపు ఛాతినొప్పితో ముంబైలోని సెయింట్‌ జార్జ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీమంత్‌ పాటిల్‌కు మహారాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

రెండో ‘లవ్‌ లెటర్‌’ వచ్చింది..
అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్‌ వజూభాయ్‌వాలా రెండో లేఖను రాశారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి’ అని లేఖరాశారు. దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..‘‘గవర్నర్‌ వజూభాయ్‌వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింది.

వజూభాయ్‌వాలాకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గవర్నర్‌ లేఖలో చెప్పారు. అంటే ఇన్నిరోజులు రాష్ట్రంలో జరుగుతున్న తతంగమంతా ఆయనకు కన్పించలేదా? మా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ప్రలోభాలపర్వం ఆయనకు కనిపించలేదా? ఆరోజే గవర్నర్‌ చర్య తీసుకునిఉంటే ఈ ప్రత్యేక విమానాలు అసలు గాల్లోకి లేచేవా? రెబెల్‌ ఎమ్మెల్యేలకు పోలీస్‌భద్రత కల్పించిన గవర్నర్‌ వారు ముంబైకి వెళ్లేలా చేశారు. ఇక విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాన్ని నేను మీకే(స్పీకర్‌కే) వదిలిపెడుతున్నాను. ఇలాంటి ఆదేశాలు ఢిల్లీ(కేంద్రం) సూచనలతో రాకూడదు. గవర్నర్‌ రాసిన లేఖ నుంచి నన్ను రక్షించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని కోరారు.

స్పీకర్‌ విధుల్లో గవర్నర్‌ జోక్యం తగదు
  అరుణాచల్‌ప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.

అరుణాచల్‌ అసెంబ్లీ కేసు..
2016లో అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ లేదన్న కారణంగా అప్పటి గవర్నర్‌ రాజ్‌కోవా నబం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇస్తూ స్పీకర్‌ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది. రద్దయిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ‘గవర్నర్‌ స్పీకర్‌కు గురువుగానీ మార్గదర్శిగానీ కాదు. కాబట్టి స్పీకర్‌ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదు. స్పీకర్‌ను తొలగించే హక్కు గవర్నర్‌కు లేదు. స్పీకర్, గవర్నర్‌లు ఇద్దరూ వేర్వేరు రాజ్యాంగ సంస్థలకు అధిపతులు’అని ఆనాటి తీర్పులో సుప్రీం కోర్టు వివరించింది. రాజకీయ పార్టీలో చెలరేగే సంక్షోభం లేదా కల్లోలానికి గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలకు ఆయన దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

గవర్నర్‌ లేఖపై భిన్నాభిప్రాయాలు
స్పీకర్‌కు గవర్నర్‌ లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి గవర్నర్‌ ఇలా లేఖలు పంపడం సమర్థనీయమేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కాశ్యప్‌ అన్నారు. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్‌కు ఉందని, దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉందని ఆయన అన్నారు. గవర్నర్‌ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టంగా చెపుతోందన్నారు. అయితే, కర్ణాటక గవర్నర్‌ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని లోక్‌సభ మరో మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు.శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ సభకు సూచించవచ్చని రాజ్యాంగంలోని 175వ అధికరణ చెబుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్‌ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు. అంతేకాని సభ ఎలా జరగాలో చెప్పే అధికారం ఆయనకు లేదు. ఏమైనా కర్ణాటక గవర్నర్‌ అసాధారణ చర్య తీసుకున్నారు’అని ఆచార్య తెలిపారు. గవర్నర్‌ చర్య సరైనదా కాదా అన్నది న్యాయస్థానం తేల్చుతుందన్నారు. శాసన సభకు సంబంధించినంత వరకు స్పీకరే సర్వాధికారి అని, సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్‌ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.


గురువారం రాత్రి విధానసౌధలో నిద్రిస్తున్న బీఎస్‌ యడ్యూరప్ప

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top