కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలవను : జగ్గారెడ్డి

I Am Not Going To Meet CM KCR Personally Says Jagga Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావును వ్యక్తిగతంగా కలవనని, మీడియా ద్వారానే  అన్ని విషయాలు చెప్పదలుచుకున్నానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలో వద్దో  అది కేసీఆర్‌ ఇష్టమని, జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని అడగనన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ సీఎం దగ్గరవుంది కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరీష్‌ రావు చేసిన నిర్వాకంతోనే సింగూరు, మంజీరా ఎండిపోయిందని, తాను పదిహేను రోజులుగా చెబుతున్నా అనధికారికంగా హరీష్ నీళ్లు తీసుకెళ్లిన దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడంలేదని మండిపడ్డారు.

మంజీర ,సింగూరుకు చేసిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందని, ఒక్క బోరు కూడా పడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల బృందాన్ని పంపి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడుపాయల జాతరకొచ్చే లక్షలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కారణంగానే ప్రస్తుత సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించారు. హరీష్ తప్పు చేశారు కాబట్టే తన కామెంట్స్‌పై స్పందించడం లేదన్నారు. తాను చెబుతున్నవి వాస్తవాలు కాబట్టే టీఆర్‌ఎస్‌ మౌనంగా ఉందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top