కాంగ్రెస్, టీడీపీ పొత్తు జుగుప్సాకరం

Harish Rao comments on Congress and TDP alliance - Sakshi

చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రాబాబే: మంత్రి హరీశ్‌రావు 

గజ్వేల్‌: తెలంగాణ ద్రోహులతో పొత్తుకు సిద్ధపడ్డ కాంగ్రెస్‌ పార్టీ, ఈ కలయికకు చెబుతున్న కారణాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని.. ఈ పొత్తు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేముందని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం ఆయన సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో మీరు పొత్తు పెట్టుకోలేదా.. అని తమను ఎదురు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఆనాడు రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తామని అంగీకారం కుదిరిన తర్వాతే ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.

చంద్రబాబుతో బహిరంగంగా ‘జై తెలంగాణ’ అనిపించిన తర్వాతే ముందుకు వెళ్లామన్నారు. దీని తర్వాత చంద్రబాబు ఆంధ్రాపైనే మమకారం ప్రదర్శించి.. తెలంగాణపై వివక్షను కొనసాగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ కారణం చేత బాబుతో పొత్తుకు సిద్ధమయ్యారో కాంగ్రెస్‌ వెల్లడించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లో కోదండరాంకు రాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవమిస్తే ఆయన ఎమ్మెల్యే కావడం కోసం ద్రోహులతో జత కడుతున్నారన్నారు. చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రాబాబేనన్నారు.

ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని స్వయం పాలన నుంచి దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలు నిర్వహించిన బైక్, ఎడ్లబండ్ల ర్యాలీల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top