మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు మీకు లేదు 

Harish Rao Comments On Congress And BJP Leaders - Sakshi

కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు  

సాక్షి, మెదక్‌: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు రైతుల విషయంలో తమను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మెదక్‌కు వచ్చిన మం త్రి విలేకరులతో మాట్లాడు తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి రుణమాఫీ చేసిందన్నారు. మొదటి దఫా కింద రూ.25 వేల లోపు రుణాలన్న వారికి ఒకేసారి మాఫీ చేస్తామని బడ్జెట్‌ సమావేశాల్లోనే స్పష్టం చేశామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను ఏం ఉద్ధరించారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే ముందు తమ లోపాలను చూసుకోవాలన్నారు. 

ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు పండించిన పంటలన్నీ కొనుగోలు చేసి వారిని ఆదుకుంటోందన్నారు. రాహుల్‌ గాంధీ ఎన్నికల సమయంలో రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ పార్టీ పాలితరాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరితోపాటు మొక్కజొన్న, జొన్న, కంది, వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసింది ఒక్క టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం ఇంతగా నిధులు ఖర్చు చేసింది లేదన్నారు.

రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఏడాదికి పదివేలు అందజేస్తున్నామన్నారు. ఈ పథకం కింద రైతుల సంక్షేమం కోసం రూ.12 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులు అకాల మరణం చెందిన సందర్భంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అనవసర విమర్శలు చేస్తే ప్రజల్లో మీరే నవ్వుల పాలవుతారని అన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరితే కేంద్రం సహకరించడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్, జెడ్పీవైస్‌ చైర్‌ పర్సన్‌ లావణ్యరెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top