తలాక్‌ చట్టం తెచ్చి తీరుతాం

Government committed to bringing triple talaq law - Sakshi

గత ప్రభుత్వాలు మహిళలను విస్మరించాయి

బీజేపీ మహిళా విభాగంతో మోదీ

డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులోనూ పాల్గొన్న ప్రధాని  

గాంధీనగర్‌: సంప్రదాయవాదులు, ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని తమ ప్రభుత్వం తెచ్చి తీరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉద్ఘాటించారు. దేశంలో గత ప్రభుత్వాలు స్త్రీల సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోలేదనీ, తమ ప్రభుత్వం వచ్చాకనే మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ మహిళా విభాగం ఐదవ జాతీయ సదస్సులో మోదీ ప్రసంగించారు. ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించే బిల్లును గతంలోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ మోకాలడ్డడంతో కేంద్ర బిల్లుకు పలు సవరణలు చేసింది.

ఈ కొత్త బిల్లుపై లోక్‌సభలో ఈ నెల 27న చర్చ జరిగే అవకాశం ఉంది. ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే భర్తలు బెయిలు పొందే అవకాశం కూడా తాజాగా ప్రభుత్వం కల్పించింది. అలాగే స్త్రీలు హజ్‌ యాత్రకు వెళ్లాలంటే పురుషులు తోడు ఉండాల్సిందేనన్న నిబంధనను కూడా తమ ప్రభుత్వం తొలగించిందని మోదీ చెప్పారు. 60–70 ఏళ్లుగా గత ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన మహిళలు ఇప్పుడు బీజేపీపై నమ్మకం పెట్టుకున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల (గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ), ‘బాలికలను రక్షించండి, చదివించండి’ తదితర పథకాలను మోదీ ప్రస్తావించారు. వైమానిక, నౌకా దళాల్లోకి కూడా తమ ప్రభుత్వం మహిళలను అనుమతించిందన్నారు.  

విభజన శక్తులతో జాగ్రత్త
సమాజంలో విభజన శక్తులు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కులం పేరిట దోపిడీలకు దిగుతున్నాయనీ, వారితో జాగ్రత్తగా ఉండాలని మోదీ పోలీసులకు సూచించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన డీజీపీ, ఐజీపీల వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించారు. కులం పేరిట జనాలను విడగొట్టే విభజన శక్తులను క్షేత్రస్థాయిలో ఏకాకులను చేయాలని ఆయన పోలీసులను కోరారు. దేశ సమగ్రత, ఐక్యతల కోసం పోలీసులు పనిచేయడాన్ని కొనసాగించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నందుకు పోలీసులను మోదీ ప్రశంసించారు.

ప్రత్యేకించి ఈ విషయంలో జమ్మూ కశ్మీర్‌ పోలీసులను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారన్నారు. కింది స్థాయిలో ప్రజల కోసం కష్టించే పోలీసులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చని సలహా ఇచ్చారు. పలువురు నిఘా విభాగం (ఐబీ) అధికారులకు రాష్ట్రపతి పతకాలను మోదీ బహూకరించారు. జాతీయ పోలీస్‌ స్మారకంతో కూడిన పోస్టల్‌ స్టాంపును కూడా విడుదల చేశారు. సైబర్‌ సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top