
అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి తాము ఇచ్చిన నివేదికపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవాలనీ ఆయన కొట్టిపడేశారు.
సాక్షి, తాడేపల్లి : తమ నివేదికపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని రిటైర్డ్ ఐఏఎస్, నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి తాము ఇచ్చిన నివేదికపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవాలనీ ఆయన కొట్టిపడేశారు. సీఎం సలహాదారు అజేయకల్లాం ఇచ్చిన రిపోర్టునే.. తామిచ్చామని చంద్రబాబు చెప్పడం అసంబద్ధమని జీఎన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
(చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు)
‘మా కమిటీలో సభ్యులందరూ అపారమైన అనుభవం కలిగినవారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించే నివేదిక రూపొందించాం. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సంప్రదించి, ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించాం. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, హెచ్‌వోడీలను సంప్రదించి డేటా సేకరించాం. ప్రజల అభిప్రాయాన్ని చెప్పాలని పత్రికా ప్రకటన ఇచ్చాం. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించాం. నివేదికపై చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తున్నాం. రాజధాని సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా కమిటీ సూచనలు చేసింది. అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యలకి పరిష్కారాల్ని సూచించాం’అని జీఎన్ రావు పేర్కొన్నారు.
(చదవండి : మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!)