మాకూ ఒక చాన్సివ్వండి!

Give BJP A Chance To Serve Meghalaya, Prime Minister Narendra modi - Sakshi

మేఘాలయ ప్రజలను కోరిన ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ చేతుల్లో రాష్ట్రం భద్రంగా లేదు

యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ ద్వారా చిత్తశుద్ధితో ‘ఈశాన్య’ అభివృద్ధి

ఫుల్బరీ/కోహిమా: మేఘాలయకు సుపరిపాలన అందించేందుకు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతుల్లో మేఘాలయ భద్రంగా ఉండబోదని విమర్శించారు. తమకు అవకాశం ఇస్తే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని.. ప్రతి రూపాయి సద్వినియోమయ్యేలా పనిచేస్తామని అందుకు తనదే భరోసా అని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ వ్యతిరేకత లేకపోవటాన్ని అలుసుగా తీసుకుని అవినీతికి పాల్పడుతోందన్నారు.

మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘మేఘాలయలో అధికార ముకుల్‌ సంగ్మా ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయింది. గర్భిణులు ఇంట్లోనే ప్రసవించే దారుణ పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇది తల్లీబిడ్డలకు ప్రమాదకరం. చాలా అంశాల్లో రాష్ట్రం అభద్రతతో తల్లడిల్లుతోంది’ అని మోదీ విమర్శించారు. యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ ద్వారా ఈశాన్య భారతాన్ని.. ఆగ్నేయాసియాతో అనుసంధానిస్తామని నాగాలాండ్‌ ప్రచారంలో పునరుద్ఘాటించారు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.  

నిధుల దుర్వినియోగం
మేఘాలయలో 1100 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం 470 కోట్లు విడుదల చేస్తే.. అందులో కనీసం 50 శాతం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన చాలా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. షిల్లాంగ్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.180 కోట్లు ఖర్చుచేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధి, ఉపాధికల్పన పెరుగుతుందన్నారు. ఇరాక్, సిరియాల్లో చిక్కుకున్న కేరళ నర్సులను కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. క్రిస్టియన్‌ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు.

సుస్థిర ప్రభుత్వం అవసరం
‘రవాణా ద్వారా ఈశాన్యరాష్ట్రాల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా, ఈ ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం’ అని నాగాలాండ్‌ ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. ‘నవభారత నిర్మాణ స్వప్నం సాకారం.. నవ నాగాలాండ్‌ కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలతో పాటుగానే జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరగనంతవరకు దేశాభివృద్ధి స్వప్నం లక్ష్యాన్ని చేరదు. అందుకే ఈ ప్రాంతంపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. సుస్థిర, బలమైన రాష్ట్ర ప్రభుత్వం నాగాలాండ్‌కు చాలా అవసరం’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున 20 మంది, మిత్రపక్షం ఎన్‌డీపీపీ తరపున 40 మంది బరిలో ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top