గాంధీ సంకల్ప యాత్ర పుస్తకావిష్కరణ

Gandhi Sankalpa Yatra Book Released By Kanna Lakshminarayana - Sakshi

సాక్షి, విజయవాడ: ‘గాంధీ సంకల్ప యాత్ర’ పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు.  విజయవాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ సంకల్ప యాత్రను రాష్ట్రంలో ఒక దీక్షలా నిర్వహించామన్నారు. గాంధీ స్పూర్తిని ఈ తరానికి చైతన్యం కలిగించేలా ప్రధాని మోదీ ఈ కార్యక్రమం చేయాలన్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి అవమానాలకు గురైన గొప్ప నేతలను స్మరించుకోవడం బీజేపీ ఉద్దేశమన్నారు. అందుకే మహాత్ముని పేరుతో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. గాంధీ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ఆయన ఆశయాలను ఆ పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు.

గాంధీజీ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నర‍్సింహరావు అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఎంపీలను ఆదేశించారని తెలిపారు. ఏపీలో గాంధీ సంకల్ప యాత్ర చాలా గొప్పగా జరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గాంధీ ఆశయాలను అసలు పాటించలేదని, లౌకిక వాదం పేరుతో హిందు వ్యతిరేక రాజకీయాలను చేసిందని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీకి సరిపోయే పేరు రాహుల్‌ జిన్నా, సోనియా జిన్నా అని వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదులో అప్పట్లో రాముడి విగ్రహం పెడితే వాటిని తొలగించేందుకు నెహ్రు ప్రయత్నించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీకే పరిమితం కాలేదని అన్నారు. కుటుంబ పాలనను కాంగ్రెస్‌ అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చేసిందని విమర్శించారు. ప్రస్తుతం అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ దారిలోనే కుటుంబ పాలన చేస్తున్నాయని అన్నారు. గాంధీజీ పేరుతో దేశంలోని వ్యవస్థను కాంగ్రెస్‌ నాశనం చేసిందన్నారు. కుటుంబాలు లేని, కుటుంబాలను వదిలేసిన పాలన బీజేపీదన్నారు. 

మహాత్మాగాంధీ పేరు చెప్పుకుని దేశాన్ని సోనియాగాంధీ కుటుంబం దేశాన్ని దోచేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. గాంధీ ఆశయాలను కాంగ్రెస్‌ పాటించలేదని అన్నారు. మోదీనే గాంధీజీకి నిజమైన వారసుడని సత్యకుమార్‌ పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను నెరవేర్చేది మోదీనే అని, మహాత్ముడి ఆశయ సాధన కోసం బీజేపీ నాయకులు 4లక్షల కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ మహిళ మోర్చా నేత పురందేశ్వరి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top