‘పొత్తు’ పోట్లాట!

Fight For Elections Alliance In Telangana - Sakshi

గ్రేటర్‌లో అధిక స్థానాలపై ‘దేశం’ కన్ను

నాలుగు స్థానాలే ఇస్తామంటున్న కాంగ్రెస్‌  

బలమైన సీట్లపై ఎవరి లెక్కలు వారివే...

సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఖాయమని తేలటంతో గ్రేటర్‌లో ఇరు పార్టీల నేతలు కూడికలు,   తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఇరు పార్టీలూ తమకు బలమైన స్థానాలుగా చెబుతూ..అభ్యర్థుల వారీగా ప్రత్యేక నివేదికలతో సిద్ధమయ్యాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ నామమాత్రంగానే మారింది. పార్టీకి బలమైన నాయకులు లేక నిర్వీర్యమైంది. ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోవటం, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పార్టీకి దూరం కావటంతో తెలుగుదేశం పార్టీ దాదాపు నిస్తేజంగా మారిపోయింది. అయితే..గడిచిన ఎన్నికల్లో గ్రేటర్‌లో ఒక లోక్‌సభ, ఎనిమిది శాసనసభ స్థానాల్లో టీడీపీ విజయం సాధించిన అంశం తమకు కొంతైనా ఉపకరిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.  అందుకే పొత్తుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక పొత్తులో భాగంగా టీడీపీ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జాబ్లీహిల్స్, సనత్‌నగర్, మలక్‌పేట, కంటోన్మెంట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్‌ స్థానాల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. ఇందులో కేవలం నాలుగు నుండి ఆరు స్థానాలు మాత్రమే ఇచ్చే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఉప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌ స్థానాల్లో బలమైన నాయకత్వం ఉండటంతో ఈ స్థానాలపై చర్చకు కూడా అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలిసింది. టీడీపీ మాత్రం సనత్‌నగర్‌లో కూన వెంకటేశ్‌గౌడ్, జూబ్లీహిల్స్‌లో ప్రదీప్‌ చౌదరి, ముషీరాబాద్‌లో ఎంఎన్‌ శ్రీనివాసరావు, ఖైరతాబాద్‌లో దీపక్‌రెడ్డి, మలక్‌పేటలో ముజఫర్‌ అలీ, ఉప్పల్‌లో వీరేందర్‌గౌడ్, ఎల్బీనగర్‌లో సామ రంగారెడ్డి, సికింద్రాబాద్‌లో బద్రీనాథ్‌యాదవ్‌లు తమకు బలమైన అభ్యుర్థులని, అందుకే ఈ స్థానాలు అడుగుతున్నామని టీడీపీ ముఖ్య నేతలంటున్నారు. దీనిపై పొత్తుల లెక్కలు ఎలా తేలుస్తారో వేచి చూడాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top