ప్రాణమున్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే..

As Far As Life Is In Ysrcp Party... Bnr Family - Sakshi

వైఎస్‌ జగన్‌ను కలిసిన బీఎన్‌ఆర్‌ కుమారులు ప్రతాప్, వెంకటేశ్‌ రెడ్డి

ప్రాణమున్నంత వరకు జగన్‌తోనే ఉంటామని వెల్లడి

ఒంటరైన గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డి

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రాణమున్నంత వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే ఉంటామని అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి కుమారులు ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్‌రెడ్డిలు స్పష్టం చేశారు. బీఎన్‌ఆర్‌ సోదరులు గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డిలు ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బీఎన్‌ఆర్‌ కుమారులు కృష్ణా జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు వెళ్లి జగన్‌ను కలిశారు. బీఎన్‌ఆర్‌ కుటుంబం టీడీపీలో చేరలేదని, ఆయన సోదరులు మాత్రమే టీడీపీలో చేరారని ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్‌రెడ్డిలు ఆయనకు తెలిపారు. తుది వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. వారితో కాసేపు అనంతపురం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీఎన్‌ఆర్‌ కుమారులు జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం అనంతపురం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

షాక్‌లో గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి
అనంతపురం ఎమ్మెల్యేగా బి.నారాయణరెడ్డికి మంచిపేరు ఉంది. బీఎన్‌ఆర్‌ సోదరులుగానే గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డిలకు గుర్తింపు. బీఎన్‌ఆర్‌ ప్రాణమున్నంత వరకూ వైఎస్‌ కుటుంబంతోనే నడిచారు. ఆయన మరణానంతరం ముగ్గురు సోదరులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీన్ని అనంతపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారు. బీఎన్‌ఆర్‌ను చూసే గురునాథరెడ్డికి ఓట్లేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని చర్చించుకున్నారు. అలాంటిది టీడీపీలోకి వెళ్లడమంటే బీఎన్‌ఆర్‌ కాకుండా వారు ముగ్గురు వ్యక్తులుగా టీడీపీలో చేరడమే అనే చర్చ ‘అనంత’లో నడుస్తోంది. ఈక్రమంలో బీఎన్‌ఆర్‌ కుమారులు తాము వైఎస్సార్‌సీపీలోనే ఉన్నామని స్పష్టం చేయడంతో బీఎన్‌ఆర్‌ పేరు లేకుండా వారి సోదరులు చేసే రాజకీయం తెప్ప లేకుండా నావ నడిపినట్లే. ఈ పరిణామం గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డితో పాటు రెడ్డప్పరెడ్డికి పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లయింది.

ప్రాణమున్నంత వరకూ జగన్‌తోనే: ప్రతాప్‌రెడ్డి 
‘‘బీఎన్‌ఆర్‌ కుటుంబం ఏ పార్టీలో చేరలేదు. మేం ప్రాణమున్నంత వరకూ జగన్‌తోనే ఉంటాం. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. కొన్ని అనివార్య కారణాలతో కొద్దిరోజులుగా ఈ ప్రకటన చేయలేదు. జగన్‌ను కలిసి మా అభిప్రాయం చెప్పాం. అనంతపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top