నాలుగో వంతు ఆర్‌వోలు ఫెయిల్‌ !

Election Returning Officers all are exam fail - Sakshi

ఎన్నికల సంఘం శిక్షణ అనంతర పరీక్ష ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం నిర్వహించిన సర్టిఫైడ్‌ శిక్షణ కార్యక్రమానికి హాజరై, పరీక్ష రాసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారు(ఆర్‌వో)ల్లో నాలుగో వంతుకు పైగా అధికారులు ఫెయిలయ్యారు. మూడో వంతుకు పైగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారు(ఏఆర్‌వో)లు సైతం ఫెయిల్‌ అయ్యారు. ఎన్నికల ఏర్పా ట్లు, నిర్వహణ అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం గత నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు ఆర్‌వోలు, ఏఆర్‌వోల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరై పరీక్ష రాసిన 119 మంది రిటర్నింగ్‌ అధికారుల్లో 29 మంది, 251 అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల్లో 90 మంది ఫెయిలయ్యారు.

అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రిట ర్నింగ్‌ అధికారులదే. వారి పరిధిలో ఉండి సహాయకులుగా ఏఆర్‌వోలు పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున 119 మంది రిటర్నింగ్‌ అధికారులతో పాటు 251 ఏఆర్‌వోలను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఆర్‌వోలు, ఏఆర్‌వోలు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఎన్నికల సంఘం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది.

రెండోసారి పరీక్ష నిర్వహణ
ఎన్నికల కోడ్‌ అమలు, సెక్టోరల్‌ అధికారుల నియామకం, నామినేషన్ల స్వీకరణ/ పరిశీలన/ ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్‌/ కౌంటింగ్‌ పాసుల జారీ తదితర అంశాలపై స్టేట్‌ లెవల్‌ మాస్టర్‌ ట్రైనర్ల (ఎస్‌ఎల్‌ఎంటీ)తో ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు ఎన్నికల సంఘం శిక్షణ నిర్వహించింది. శిక్షణ అనంతరం అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే ప్రశ్నపత్రంతో రెండు పార్టులతో పరీక్ష నిర్వహించింది.  బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో నిర్వహించిన ఈ పరీక్షలో నాలుగో వంతు ఆర్‌వోలు, మూడో వంతు ఏఆర్‌వోలు విఫలమయ్యారు. ఫెయిలైన ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు ఎన్నికల సంఘం ఆదేశాలతో గురువారం మరోసారి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఎస్‌ఎల్‌ఎంటీలతో మళ్లీ శిక్షణ నిర్వహించి రెండోసారి పరీక్ష నిర్వహించారు. రెండోసారి విఫలమైన ఆర్‌వో, ఏఆర్‌వోలను తప్పించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం అధికారవర్గాలు తెలిపాయి.

నిర్మల్‌ జిల్లా ఆర్వోలందరూ ఫెయిల్‌
అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలోని 15 మంది ఆర్‌వోల్లో ఐదుగురు, 33 మంది ఏఆర్‌వోల్లో 21 మంది, నిర్మల్‌ జిల్లాలోని ముగ్గురికి ముగ్గురు ఆర్‌వోలు, ఆరుగురు ఏఆర్‌వోల్లో నలుగురు ఫెయిలయ్యారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురిలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలోని ఐదుగురిలో ముగ్గురు, ఆదిలాబాద్‌ జిల్లా లో ఇద్దరిలో ఒక ఆర్‌వో ఫెయిలయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top