‘సోనియా కాళ్లు మొక్కింది మర్చిపోయారా’

DK Aruna Fire On KCR Over Wanaparthy Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కూతురు కవితకు తప్ప మహిళలెవ్వరికి గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌లో ఆమె ప్రర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌పై, ఆయన కుటుంబ పాలనపై విరుచుకపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్‌లో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలకోసమే ప్రత్యేక రాష్ట్రం వచ్చాందా అంటూ ప్రశ్నించారు. మహిళలను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌ను గద్దె దించేందుకు అక్కాచెల్లెల్లు సిద్దంగా ఉండాలని కోరారు. డీకె (ఒక శక్తి తో పెట్టుకున్నావ్...ఇగ కాస్కో)

దమ్ముంటే బండారం బయటపెట్టు
‘సోనియమ్మను కేటీఆర్‌ అమ్మనా బొమ్మనా అంటాడా? తెలంగాణ ఇచ్చాక కుటుంబం అంతా పోయి కాళ్లు మొక్కింది మరిచిపోయావా?.నేను గద్వాలలో ప్రశ్నించిన వాటికి కేసీఆర్‌ సమాధానం చెప్పక అరుణమ్మ ఒళ్లు దగ్గర పెట్టుకో అంటడు.. నీ ఇంట్లో మహిళలను ఎవరైనా అలా అంటే ఊర్కుంటావా?బండారం బయట పెడుతడట.. ఏం బండారం పెడుతవో దమ్ముంటే బయటపెట్టు. ఆయనను ఏమైనా అంటే సీఎంను అంటారా అంటుండు. మరి సీఎం పదవిలో ఉన్న నువ్వు ఎట్ల పడితే అట్ల మాట్లాడుతావా? తెలంగాణ తెచ్చుకుంది బాంఛన్‌ దొర అనేందుకా? ప్రజలను ఒక్కటే అడుగుతున్నా మళ్లీ కేసీఆర్‌ దోరకు అధికారం కట్టబెట్టి బానిసల్లా బతుకుదామా అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. (పాలమూరుకు ఏం వెలగబెట్టావ్‌?)

ముందస్తుకు ఎందుకు పోయినవ్‌
‘తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే బాధ్యత మహిళలపై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీఠ వేశాం కానీ కేసీఆర్ పాలనలో మహిళలకు ఒక్కపథకం తెచ్చారా, కనీసం ఒక్క మీటింగ్ పెట్టారా? జీహెచ్ఎంసీలో రోడ్లు ప్రజలకోసం వేస్తున్నారా? కాంట్రాక్టర్లకోసమా? విశ్వనగరంలో హైదరాబాద్ రోడ్లు తీర్చిదిద్దుతామని చెప్పిన మీరు ఇప్పుడు నోరెందుకు మెదుపుతలేరు. రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉంటే బాగుచేయకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయినవ్? ఉద్యమం సమయంలో ఆంధ్రవాళ్లు పోతే ఇళ్లన్నీ మనవే అని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ల ఓట్లకోసం కాలికి ముళ్లుగుచ్చితే పంటితో తీస్తా అని  కేసీఆర్‌ చేసిన నీచ రాజకీయలను ప్రజలందరు గుర్తుంచుకోవాలి’అంటూ డీకే ఆరుణ కేసీఆర్‌ తీరుపై విరుచుకపడ్డారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top