అరుణాస్త్రం | DK Aruna Commit to Padayatra From Jogulamba To Adilabad | Sakshi
Sakshi News home page

అరుణాస్త్రం

Feb 24 2018 8:13 AM | Updated on Mar 18 2019 7:55 PM

DK Aruna Commit to Padayatra From Jogulamba To Adilabad - Sakshi

మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  పాలమూరు ప్రాంతంలోని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించడంతో ఇది తీవ్రరూపం దాల్చనుంది. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి సన్నిధి నుంచి ఆదిలాబాద్‌ వరకు పాదయాత్ర చేపట్టాలని ఆమె నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో పాటు ఏఐసీసీ నేతలకు లేఖలు రాశారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌కు సంబంధించి కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి సైతం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి పీసీసీ సమావేశంలో సైతం ఆమోదముద్ర లభించింది. తాజాగా డీకే అరుణ పాదయాత్ర తెరపైకి రావడంతో జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. 

రచ్చకెక్కుతున్న రాజకీయం
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇన్నాళ్లు డీకే అరుణ అంతా తానై నడిపించగా.. ఇటీవలి కాలంలో జైపాల్‌రెడ్డి అరంగేట్రంతో సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నేతల మధ్య నెలకొన్న మనస్పర్థలను స్పష్టం చేస్తున్నాయి. పార్టీ నేతలంతా రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికివారే యమునాతీరు అన్న చందంగా వ్యవహరిస్తన్నారు. ఈ నేపథ్యంలో ఒకరికొకరు చెక్‌ పెట్టేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జైపాల్‌రెడ్డి వర్గం పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహిస్తూ.. వారి ద్వారా డీకే అరుణకు చెక్‌ పెట్టొచ్చనేది వారి భావనగా చెబుతున్నారు. దీనికి ప్రతిగా.. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన తమపై కుట్ర జరుగుతోందంటూ డీకే వర్గం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ పట్టు పెంచుకోవాలని నిర్ణయించుకుని పాదయాత్రకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

చేరికలపై పెదవి విరుపు
కాంగ్రెస్‌లో నేతల చేరికల పట్ల డీకే.అరుణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని అంటి పెట్టుకున్న తమను సంప్రదించకుండా నేరుగా చేర్చుకోవడమేంటని ఫైర్‌ అవుతున్నారు. పార్టీలో చేరికలకు తాము విరుద్ధం కాకున్నా.. చర్చలు జరిపిన తర్వాతే కొత్తవారిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లోని మరో వర్గం మాత్రం ఇదేం పట్టించుకోకుండా బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిని చేర్చుకోవడానికి కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగా ఇటీవలి కాలంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నాగం ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు తాజాగా వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... టీడీపీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని, ఆయనకు దేవరకద్ర నుంచి అవకాశం కల్పించాలంటూ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ అంశంపైనా డీకే.అరుణ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  

అందుకే యాత్రా?
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే పాదయాత్ర అంటూ డీకే.అరుణ వర్గం పైకి చెబుతున్నా ఆధిపత్యపోరు కోసమేననే చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో జిల్లా కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అరుణ శిబిరాన్ని కొంత మేర ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పార్టీలో తమ పట్టును సడలనివ్వకుండా.. పాదయాత్ర ద్వారా జిల్లా, రాష్ట్రస్థాయిలో ఇమేజ్‌ పెంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక మహిళగా అందులోనూ వేసవిలో పాదయాత్ర చేయడం ద్వారా తమ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలనేది వారి భావనగా ప్రచారం సాగుతోంది. 

కొట్టిపారేస్తున్న డీకే వర్గం
పార్టీలో ఆదిపత్య పోరు కోసమే డీకే.అరుణ పాదయాత్ర తలపెడుతున్నారన్న ప్రచారాన్ని ఆమె వర్గం ఖండిస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకే ఆమె యాత్ర చేపడుతున్నారని పేర్కొంటున్నారు. ఇకప్రజా సమస్యలపై ఆమె గొంతు విప్పడం కొత్తేమి కాదని.. జోగులాంబ గద్వాల జిల్లా సాధన విషయంలో అరుణ పట్టుదలను గుర్తు చేస్తున్నారు. అలాగే తాజాగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను కూడా పాదయాత్ర ద్వారా ప్రస్తావిస్తారంటూ డీకే అరుణ వర్గం స్పష్టం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement