ఎంత వ్యత్యాసం!

Difference Between Chandrababu Naidu And YS Jagan Mohan Reddy - Sakshi

గత ప్రభుత్వంలో సభ జరిగితే అధికారులపైనే ఖర్చుల భారం

జనాన్ని తీసుకురావడం,  బస్సులు, కార్ల ఏర్పాటు, టిఫిన్లు వగైరా అన్నీ..

ఇప్పటికీ బిల్లులు పెండింగ్‌లోనే ఉంచిన గత ప్రభుత్వం

గురువారం సభకు సంబంధించి అధికారులపై భారం లేకుండా చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

నవ్యాంధ్రలో తొలిపొద్దు పొడిచింది.. సంక్షేమ పాలనలో నవ శకం ఆరంభమైంది.. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారం కానుంది.. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పింఛన్ల పెంపుపై చేసిన మొదటి సంతకంతో ప్రజాపాలనలో తొలి అడుగు వేసింది.. ఈ అద్భుత ఘట్టానికి విజయవాడ నగరం సాక్షీభూతంగా నిలిచింది.. రాజకీయ విభేదాలు, కుల మతాల పట్టింపులు లేని, అవినీతి రహిత పాలనే తన అభిమతమని.. ఇందుకు శ్రద్ధతో.. అంతఃకరణ శుద్ధితో పాలన సాగిస్తానంటూ చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి జగమంతా జేజేలు పలికింది.. శతమానం భవతి అంటూ మనసారా దీవించింది.  

సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పక్షాన ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే.. అధికారులకు ప్రాణసంకటంగా మారేది. ముఖ్యంగా రాజధాని విజయవాడలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత అధికారులపైనే ఉండేది. దీనికి సంబంధించిన ఖర్చు కూడా వారే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ తర్వాత బిల్లులు మంజూరు చేయకపోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించేది. దీంతో అధికారులు ఇబ్బందులు పడేవారు.

‘దీక్ష’ ఏదైనా...
చంద్రబాబు ప్రభుత్వం ధర్మపోరాట దీక్ష, ఏటా జూన్‌ 2 నవ నిర్మాణదీక్షలను నిర్వహించింది. అలాగే రేషన్‌ డీలర్లతో, ఆశా వర్కర్లు, పోలీస్‌హోమ్‌ గార్డులతో సమావేశాలు నిర్వహించింది. ఆయా కార్యక్రమాలకు సంబంధించి జనసమీకరణ అధికారులు తలకు మించిన భారమయ్యేది. ఆర్టీసీ నుంచి బస్సులు అద్దెకు తీసుకుని డ్వాక్రా గ్రూపులు, పార్టీ కార్యకర్తల్ని తరలించాల్సి వచ్చేది. అలాగే పోలవరం సందర్శన పేరుతో ఆర్టీసీ నుంచి ఉచిత బస్సులు నడిపారు. ఇవన్ని కలిసి సుమారు రూ.10 కోట్లు వరకు ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడింది. ఇక సభలకు వచ్చే నాయకులకు, అధికారులకు కావాల్సిన కార్లు, డీజిల్, పెట్రోల్‌ తదితర ఏర్పాట్లు రవాణాశాఖ అధికారులు పై పడేది. దీనికి సంబంధించి బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కార్లు అద్దెకు ఇవ్వడానికి ట్రాన్స్‌పోర్టర్లు ఇష్టపడేవారు కాదు. దీంతో తనిఖీల్లో పట్టుకున్న కార్లు, వ్యాన్లను బలవంతంగా సమావేశాలకు వినియోగించేవారు. ఇక సభాస్థలి ఏర్పాట్ల బాధ్యతంతా రెవెన్యూశాఖ పై ఉండేది. రెవెన్యూశాఖ అధికారులు ఇప్పటికే షామియానా సప్లయిర్స్‌కు లక్షల రూపాయల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇక బిస్కెట్లు, కూల్‌ డ్రింక్స్, మధ్యాహ్నం భోజనం, వాటర్‌ సప్లయి బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉండేది. గత ఏడాది జూన్‌లో జరిగిన నవనిర్మాణ దీక్ష డబ్బులు కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఇలా జిల్లాలో సుమారు రూ.100 కోట్లు వరకు ఈ తరహా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడం, మరోవైపు సప్లయిర్స్‌ నుంచి ఒత్తిడి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు తమ చేతి నుంచి కొంత సొమ్ము చెల్లించిన సందర్భాలు ఉన్నాయని వారు వాపోతున్నారు.

ఒక్క రూపాయి భారం లేదు..
గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం అధికారులపై ఒక్క రూపాయి భారం పడలేదు. సీఎం ఆదేశాలతో కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆధ్వర్యంలో అధికారులు సాధ్యమైనంత పొదుపుగా కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలను పార్టీ నాయకులే తమ సొంత వాహనాల్లో తీసుకొచ్చా రు. అయితే ఆయా శాఖల అధికారులు మాత్రం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. వచ్చిన అతిథులకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండానే చూశారు తప్ప తమ జేబుల్లోంచి పెట్టే అవసరం  రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top