ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటే!

Devineni Uma Facing Toughest Fight in Mylavaram Constituency - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ టీడీపీలో గెలుపుపై ధీమా సన్నగిల్లుతోంది. మంత్రి దేవినేని ఉమ హ్యాట్రిక్ ఆశలపై ప్రజావ్యతిరేకత నీళ్లుకుమ్మరిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మంత్రిగారి అవినీతి.. అనుయాయుల దందాలు ఈ ఎన్నికల్లో తమ కొంపముంచుతున్నాయనే అంచనాలతో టీడీపీ డీలాపడింది.

ఈ ఎన్నికల్లో గెలుపోటములపై ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న ప్రధాన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా మైలవరం ఒకటి. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి దేవినేని ఉమ, మరోవైపు మాజీమంత్రి కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ తలపడ్డారు. గెలుపుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో.. మైలవరంలో విజేత ఎవరూ అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

మైలవరం నియోజకవర్గంలో 2 లక్షల 59 వేల 500 మంది ఓటర్లుండగా.. వీరిలో స్త్రీలు 1,30,812, పురుషులు 1,28,673. టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి  హ్యాట్రిక్‌ కొట్టాలని భావించిన దేవినేని ఆశలు ఆవిరేనని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి ప్రజలకు బాగా దగ్గరైన వసంత కృష్ణప్రసాద్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతోనే దేవినేనికి గట్టిపోటీ ఎదురయ్యిందని, ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గట్టి ప్రత్యర్థిని ఎన్నికల్లో ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మంత్రి దేవినేని ఉమ చివరికి అధికార దుర్వినియోగానికి ప్రయత్నించడం కూడా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టించేందుకు మంత్రి దేవినేని చేసిన ప్రయత్నం అభాసుపాలై.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలతను మరింత పెంచింది. మైలవరం నియోజకవర్గంలో మంచినీటి సమస్యను, మామిడి రైతుల కష్టాలను, సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా మంత్రిదేవినేని ఉమ అయిదేళ్లపాటు నడిపిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇదే క్రమంలో అక్రమ మైనింగ్‌ ద్వారా ఆయన అనుయాయులకు కోట్ల రూపాయలను దండుకునే అవకాశం కల్పించడం, ఇసుక, మట్టి తవ్వకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం, చివరికి అనుమతిలేని బోట్లతో అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమవ్వడం వంటి అంశాలు అనేకం తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా మారాయి. జన్మభూమి కమిటీల కారణంగా అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కకపోవడం, పైరవీ కారులు, అనర్హులకే పెన్షన్ల నుంచి పక్కాగృహాల వరకు కట్టబెట్టడం మొదలైన అంశాలు మంత్రి దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పని స్థితిని తెచ్చిపెట్టాయని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.

మైలవరం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందనే ప్రచారం జరుగుతోంది. ధన ప్రభావం అధికంగా కనిపించిన నియోజకవర్గాల్లో మైలవరంకూడా నిలుస్తోంది. మంత్రి దేవినేని ఉమ అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రతిపక్షాలు బాహాటంగానే విమర్శలు చేశాయి. దాంతో మైలవరం ప్రజలు...అధికార టిడిపిపై తీవ్ర అసంతృప్తితో రగిలి పోయారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోపై అభిమానం పెంచుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో అధిక శాతం అంశాలు తమకు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో తెలుగుదేశం నేతలు నిరుత్సాహంలో పడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top