హరీశ్‌, జీవన్‌రెడ్డి మధ్య మండలిలో మాటల యుద్ధం

Congress MLC Jeevan Reddy Minister Harish Rao Altercation In Legislative Council - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మధ్య శాసన మండలిలో శనివారం మాటల యుద్ధం నడిచింది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఎలాంటి విఙ్ఞప్తులు రాలేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు. కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంలో కేంద్రం చెబుతోంది తప్పా.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది తప్పా..? అని ప్రశ్నించారు. కాగా జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపమంతా కాంగ్రెస్‌దేనని అన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదాను ఎందుకు విస్మరించారని నిలదీశారు.
(చదవండి : హరీశ్‌.. తొలిసారి)

స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రిని కలిసి అన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిందని తెలిపారు. ఇంత కంటే ఏం సాక్ష్యాలు కావాలని అన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసులు వేసినోళ్ల పేర్లను సభా ముఖంగా తానే వెల్లడించానని హరీశ్‌ చెప్పారు. అయితే, ఎవరి తప్పు ఎలా ఉన్నా... రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడుకుండా చూడాలని జీవన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే... ఎవరు తప్పు చెబుతున్నారో తెలుస్తుంది కదా అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top