అనూహ్యం.. చేతులు కలిపిన బీజేపీ-కాంగ్రెస్‌

Congress BJP join hands for CADC in Mizoram - Sakshi

ఐజ్వాల్‌ ; మిజోరం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం నెలకొంది. చక్మా జిల్లా స్వతంత్ర్య పాలక సంస్థ(CADC) కోసం కాంగ్రెస్‌ పార్టీ-బీజేపీలు చేతులు కలిపాయి. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. 

మొత్తం 45,000 జనాభా ఉన్న సీఏడీసీ పరిధిలో శుక్రవారం ఎన్నికలు జరిగాయి. మంగళవారం వాటి ఫలితాలు వెలువడగా.. మొత్తం 20 సీట్లలో  కాంగ్రెస్‌ 6, బీజేపీ 5 సీట్లు దక్కించుకున్నాయి. మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎమ్‌ఎన్‌ఎఫ్‌) 8 సీట్లు గెలుచుకుంది. మరో సీటుపై కోర్టు స్టే ఆర్డర్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్‌ఎన్‌ఎఫ్‌కు అధికారం దక్కనివ్వకూడదని ఇరు పార్టీలు నిర్ణయించుకుని ఓ ఒప్పందానికి వచ్చాయి. బీజేపీ తరపున శాంతి జిబన్‌ చక్మా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా, కాంగ్రెస్‌ తరపున బుద్ధ లీలా చక్మాను డిప్యూటీ లీడర్‌గా ప్రతిపాదిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర క్రీడాశాఖ మత్రి జోడింట్లువాంగా నిర్ధారించారు.   

అధిష్ఠానం నుంచి అభ్యంతరాలు... అయితే స్థానిక నేతలు చేసిన ఈ పని పట్ల బీజేపీ అధిష్ఠానం గుర్రుగా ఉంది. ఫలితాలు వెలువడ్డాక అమిత్‌ షా ఎమ్‌ఎన్‌ఎఫ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఓ ట్వీట్‌ చేశారు. కానీ, ఆ నిర్ణయాన్ని కాదని కాంగ్రెస్‌-బీజేపీ సభ్యులు కలిసి పని చేయాలన్న నిర్ణయించారు. ఎమ్‌ఎన్‌ఎఫ్‌ విధానాలపై మెజార్టీ ప్రజల్లో వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఓవైపు రాష్ట్రంలో.. మరోవైపు కేంద్రంలో కొట్టుకుంటున్న ఈ రెండు పార్టీలు ఎలా చేతులు కలుపుతాయని బీజేపీ అధిష్ఠానం ప్రశ్నిస్తోంది. ఈ మేరకు తమ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది.

సీడీఏసీ స్వతంత్ర్య విభాగం. చక్మా తెగ ప్రజలకు సంబంధించింది. 1972 ఏప్రిల్‌ 29న రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను అనుసరించి అప్పటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చట్టాలు, న్యాయ పరిధిలోని అంశాలపై హక్కులన్నీ ఈ సంస్థకే ఉంటాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top