పొత్తుకు ముందే చిత్తు!

Conflicts Between Leaders In Alliane Elections - Sakshi

శివారు నియోజకవర్గాలన్నీ కోరుతున్న తెలుగుదేశం

ఇప్పటికే పలు నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం

పొత్తును వ్యతిరేకిస్తూకాంగ్రెస్‌లో నిరసన వెల్లువ

పార్టీని వదిలిన ఉప్పల్‌ నేత లక్ష్మారెడ్డి, రేపు టీఆర్‌ఎస్‌లోకి..

మిగిలిన నియోజకవర్గాల్లోనూ.. మొదలైన అలజడి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎన్నికల పొత్తు.. నగరంలో అప్పుడే నిప్పు రాజేసింది. పొత్తులు అనైతికమంటూ ఉప్పల్‌ నియోకజవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి, నాచారం కార్పొరేటర్‌ శాంతి సహా ముఖ్య నాయకులందరితో కలిసి పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఉప్పల్‌ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ స్థానంలో టి.వీరేందర్‌గౌడ్‌ పేరు కూడా ఖరారు చేయటంతో మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పనిచేస్తున్న లక్ష్మారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, వెంటనే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లక్ష్మారెడ్డి పార్టీని వీడటం కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లుగా ఆయన నియోకజవర్గంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 12న తనతో పాటు నాచారం కార్పొరేటర్‌తో పాటు మిగిలిన ముఖ్య నాయకులందరితో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ తమ సిట్టింగ్‌ స్థానాలైన ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల కోసం పట్టుపడుతుండటం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతోంది.  వాస్తవానికి  ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలుగుదేశం పార్టీ ఆయా నియోకజవర్గాల్లో బలహీనపడిపోగా, కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎల్‌బీనగర్‌లో సుధీర్‌రెడ్డి, మహేశ్వరంలో సబిత, శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్, కుత్బుల్లాపూర్‌లో శ్రీశైలంగౌడ్, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఉన్న ఫలంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు రావటం, తెలంగాణాలో మెజారిటీ స్థానాలు నగరం నుండే పోటీ చేస్తామని టీడీపీ నాయకులు పేర్కొంటుండడంతో ఇప్పటి వరకు ఈ స్థానాలపై ఆశలు పెట్టుకుని నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. బలమైన అభ్యర్థులు–నియోజకవర్గాల వారిగా కాకుండా కేవలం సిట్టింగ్‌ ప్రాతిపదికనే టీడీపికి స్థానాలు కేటాయిస్తే.. నగరంలో ముఖ్య నాయకులంతా కాంగ్రెస్‌ పార్టీని వీడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయమై ఎల్బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అన్ని అంశాల్ని, తాజా పరిస్థితులను అంచనా వేసి.. ఆ మేరకు సర్వేలు నిర్వహించుకున్న తర్వాతే సీట్ల కేటాయింపులు చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top