ప్రధాని మోదీ నమ్మక ద్రోహి!

Chandrababu Naidu Fires On Narendra Modi - Sakshi

పులివెందుల, జమ్మలమడుగు సభలలో సీఎం చంద్రబాబు

కియా మోటార్స్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లేందుకు యత్నించారు

రాష్ట్ర విభజన హేతుబద్ధంగా లేదు.. కట్టుబట్టలతో వచ్చాం

పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు ‘కృష్ణా’కు తీసుకువచ్చాం

ఆ నీటిని పులివెందులకు ఇచ్చాం

కేసీఆర్‌ నాతో ఆడుకున్నారు.. ఆయన్ని వదిలేది లేదు

సాక్షి ప్రతినిధి కడప: ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమ్మకద్రోహం చేశారు.. ఆయన ఏపీ అభివృద్ధికి సహకరించలేదు.. కియా మోటార్స్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే పోరాడి సాధించా’నని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేపట్టలేదని.. కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని.. అండగా ఉంటారని భావించిన మోదీ ద్రోహం చేశారని.. మన ఆస్తుల్ని కేసీఆర్‌ స్వాహా చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు, పులివెందులలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్‌ నగరాన్ని వదిలిపెట్టి వచ్చామని, అలాంటి హైదరాబాద్‌లను రాష్ట్రంలో నిర్మిస్తామని సీఎం చెప్పారు. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ‘కృష్ణా’కు తీసుకొచ్చామని, అక్కడ నుంచి పులివెందులకు తీసుకొచ్చామని ఆయన వివరించారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. అక్రమార్కులను ప్రధాని మోదీ విదేశాలకు పంపిస్తే, తాను అగ్రిగోల్డ్‌ అక్రమార్కులను జైలుకు పంపించానన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనతో ఆడుకున్నారని.. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తేలేదని చెప్పారు. 

హార్టికల్చర్‌ హబ్‌గా పులివెందుల
పులివెందులలో పండ్ల తోటలు అధికంగా ఉన్నందున ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు ప్రకటించారు. కోల్డ్‌స్టోరేజీలు నిర్మించి, చైన్‌లింక్‌ ఏర్పాటుచేస్తామన్నారు. కాగా, హార్టికల్చర్‌ హబ్‌ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో.. ‘ఎన్నిసార్లు చెబుతావ్‌ సామీ’.. అంటూ కొందరు కేకలు వేశారు. పులివెందులలో సతీష్‌రెడ్డిని గెలిపిస్తే గండికోట ప్రాజెక్టులో 22 టీఎంసీలు నీరు నిల్వచేస్తామని, ఎంపీగా ఆదినారాయణరెడ్డిని గెలిపిస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక్కడ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి లాగా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చామని.. వారు కూడా గట్టిగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top