రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ

Chandrababu met with Rahul Gandhi - Sakshi

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలసి ముందుకుపోవడంపై చర్చలు!

 సాక్షి, న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత.. రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంట పాటు వారి భేటీ కొనసాగింది. రాబో యే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో కలసికట్టుగా ముందుకు పోవడంపై రాహుల్‌తో చంద్రబాబు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేసే అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ను, ఇతర పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్న అంశం చర్చకొచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకుంటున్న తరుణంలోనే యూపీలో ఎస్పీ, బీఎస్పీలు తాముగా పొత్తు కుదుర్చుకోవడం, ఈ విషయంలో కాంగ్రెస్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో భాగంగా కోల్‌కతాలో ఈ నెల 19వ తేదీన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీపైనా రాహుల్, చంద్రబాబుల మధ్య చర్చ జరిగింది.

ఈ భేటీ అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కలిశారు. ఆ తర్వాత ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ను, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాలను చంద్రబాబు కలిశారు. శరద్‌ పవార్‌తో సమావేశానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న కోల్‌కతాలో జరిగే ర్యాలీకి హాజరు కావాలని తాము నిర్ణయించినట్టు తెలిపారు. ర్యాలీకి వివిధ పార్టీల నేతలు హాజరవుతారని, ఆ సందర్భంగా అందరమూ కలసి జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంపై ఏ విధంగా ముందుకు పోవాలనేదానిపై తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. యూపీలో కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీసుకోకుండా అఖిలేశ్, మాయావతిలు పొత్తు కుదుర్చుకోవడంపై  మీడియా ప్రశ్నించగా.. రాష్ట్రాల స్థాయిలో ఆయా పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా పోటీ చేసుకుంటాయని, కానీ జాతీయ స్థాయిలో కలసి పనిచేసేలా తాము ప్రయత్నిస్తామని ఆయన బదులిచ్చారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top