హైవేపై హైడ్రామా!

Chandrababu Hydrama At DGP Office On Macherla Incident - Sakshi

గంటల వ్యవధిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు ప్రెస్‌మీట్లు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఓ చిన్న ఘటనను సాకుగా చూపి ప్రతిపక్ష నేత చంద్రబాబు బుధవారం నడిపిన హైడ్రామా చూసి సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణను పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తూ ఆయన చేసిన హడావుడికి అంతా విస్తుపోయారు. గంటల వ్యవధిలో మూడుసార్లు ప్రెస్‌మీట్లు నిర్వహించి పట్టలేని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీర్ఘంగా మాట్లాడటం, డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి బైఠాయించడం, పోలీసు అధికారులు లోపలకు రావాలని కోరినా తిరస్కరించి రోడ్డుపైనే కూర్చుని చేసిన హంగామాకు అందరూ నివ్వెరపోయారు.

- మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి పెద్దగా అరుస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రం అల్లకల్లోలమైందనే భ్రమ కలిగించే రీతిలో వ్యక్తం చేసిన హావభావాలు చూసి సామాన్య ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ‘మా నాయకులను చంపేస్తారా..? చంపేస్తే చంపేయండి..’ అంటూ కొద్దిసేపు, ‘ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగాయా? ఇవన్నీ చూసి ప్రజలు ఆలోచించాలి’ అంటూ దండం పెట్టారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి హడావుడి చేశారు. 
- మాచర్ల నుంచి బొండా, బుద్ధా రాగానే మళ్లీ మీడియా సమావేశం నిర్వహించి వారితో గంటన్నర మాట్లాడించి తాను మరో 45 నిమిషాలు ప్రసంగించారు.
పోలీస్‌ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు డీజీ రవిశంకర్‌కు కొద్దిసేపు విలువల గురించి ఉద్బోధించారు.
అనంతరం చంద్రబాబు రోడ్డుపైనే కూర్చుని మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరగంటసేపు మాట్లాడారు. అక్కడినుంచి విజయవాడలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతుండగా మీడియా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అయిష్టంగానే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top