ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ తీరుపై నిరసన

Catholic Association Protest Against MLA Stephenson - Sakshi

రాంగోపాల్‌పేట్‌: క్రైస్తవ మతానికి, మత పెద్దలకు వ్యతిరేకంగా శాసనసభలో మాట్లాడిన నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్వీస్‌ స్టీఫెన్‌సన్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ క్యాథలిక్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరును ఖండిస్తూ ఆదివారం ఎస్డీరోడ్‌లోని సెయింట్‌ మేరీస్‌ చర్చి ఆవరణలో స్టీఫెన్‌సన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపు బాలరెడ్డి మాట్లాడుతూ.. ఆంగ్లో ఇండియన్లకు ప్రతినిధి అయిన స్టీఫెన్‌సన్‌ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఇండిపెండెంట్‌ పాస్టర్లను కట్టడి చేయాలని శాసనసభలో మాట్లాడి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. క్యాథలిక్‌ విద్యా సంస్థల్లో క్రైస్తవ మైనార్టీ విద్యార్థులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వడంతో పాటు అర్హులందరికీ ఫీజులో రాయితీలు కల్పిస్తున్నామన్నారు. పోప్‌లు, బిషప్‌లు కేవలం ఆధ్యాత్మిక  బోధకులే కాదని క్యాథలిక్‌ సమాజానికి వాళ్లు సామాజిక నాయకులని అలాంటి వారిని ప్రశ్నించే హక్కు, అర్హత ఆయనకు లేదన్నారు. అసోసియేషన్‌ ప్రతినిధి ఆరోగ్యరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంగ్లో ఇండియన్‌ అసోసియేషన్‌ ప్రతినిధి మోరిన్‌ హ్యాచ్‌ మాట్లాడుతూ.. తాను క్యాథలిక్‌ కాకపోయినప్పటికీ స్టీఫెన్‌ మాటలు క్రైస్తవ సమాజానికి మంచిది కాదనే భావనతో వీరికి మద్దతు ఇస్తున్నామన్నారు. నిరసనలో రాయ్‌డిన్‌ రోచ్, ఎల్‌ఎం రెడ్డి, సాంద్రా, శశిధర్, ఇంగ్రిడ్‌ పాయ్‌ ఖురానా పాల్గొన్నారు.

స్టీఫెన్‌సన్‌ చెప్పినవి వాస్తవాలు: మత్తయ్య
క్రైస్తవ సమాజంలో శాసనసభలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ వాస్తవాలు మాట్లాడారని క్రైస్తవ ధర్మప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవ మైనార్టీ విద్యా సంస్థలు మాఫియా లాగా తయారయ్యాయన్న వాస్తవాన్ని ఎమ్మెల్యే సభ ముందుకు తేవడంతో దీన్ని జీర్ణించుకోలేక కొందరు హంగామా చేస్తున్నారని విమర్శించారు. క్రైస్తవ మైనార్టీ విద్యా సంస్థల్లో ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం లేదని, ఎంతో మంది క్రైస్తవ పిల్లలను ఫీజులు కట్టకుంటే బయటకు గెంటేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. దమ్ముంటే ఎంతమంది విద్యార్థులకు ఏయే సంవత్సరాల్లో సీట్లు, రాయితీలు ఇచ్చారా చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top