‘వసుధైక కుటుంబా’నికి ప్రచారకర్తలు!

Bohra sect integral to peace in India - Sakshi

బోహ్రా ముస్లింలపై మోదీ ప్రశంస

నిజాయితీతో వ్యాపారాలు చేస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని కితాబు

ఇమామ్‌ హుసేన్‌ స్మారక కార్యక్రమంలో ప్రసంగం

ఇండోర్‌: రాబోయే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాని మోదీ ముస్లింలకు చేరవయ్యే ప్రయత్నం చేశారు. మహ్మద్‌ ప్రవక్త మనవడు ఇమామ్‌ హుసేన్‌ స్మారకార్థం ఇండోర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బోహ్రా ముస్లింలపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. సహజీవనం, సామరస్య సందేశాలను బోహ్రాలు విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. వారు నిజాయితీ, విలువలతో వ్యాపార కార్యకలాపాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పథకాలను ఈసందర్భంగా  మోదీ ప్రస్తావించారు. బోహ్రా ఆధ్యాత్మిక గురువు సయ్యద్‌నా ముఫద్దాల్‌ సైఫుద్దీన్‌తో మోదీ వేదిక పంచుకున్నారు.

శాంతి, న్యాయం కోసం ఇమామ్‌ హుసేన్‌ తన ప్రాణాలను త్యాగం చేశారని మోదీ కొనియాడారు. ఆయన బోధనలు ఆనాటి కన్నా నేటి సమాజానికే ఎక్కువ అవసరమని పేర్కొన్నారు. ‘వసుధైక కుటుంబం’ అనే భావన భారత్‌ బలమని.. బోహ్రాలు కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారని ప్రశంసించారు. ‘మనకు గతం గర్వకారణం. వర్తమానం విశ్వాసం. భవిష్యత్‌ భరోసా’ అని వ్యాఖ్యానించారు.  ‘ఆశరా ముబారక్‌’ పేరిట ఏటా నిర్వహిస్తున్న కార్యక్రమానికి దేశ ప్రధాని హాజరవడం ఇదే తొలిసారి. ‘వ్యాపారాలను నిజాయితీతో నిర్వర్తిస్తూ బోహ్రాలు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

జీఎస్టీ సద్వినియోగం
జీఎస్టీ, మేకిన్‌ ఇండియా లాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకున్నారు. చేతికున్న ఐదు వేళ్లు సమానంగా ఉండవు. అందుకే కొందరు వ్యాపారాన్ని మోసపూరితమైనదని భావిస్తున్నారు. వ్యాపారాలు చట్టాలకు లోబడి జరగాలని నాలుగేళ్లుగా చెబుతున్నాం. జీఎస్టీ, దివాలా చట్టాలతో నిజాయతీ కలిగిన వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ అన్నారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమం విజయవంతం కావడంలో దావూదీ బోహ్రాల పాత్ర ఉందని పేర్కొన్నారు. బోహ్రా మత గురువు దివంగత సయ్యద్‌ మహ్మద్‌ బుర్హానుద్దీన్‌కు మహాత్మా గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాలను మోదీ గుర్తుచేశారు. రెండంకెల వృద్ధిరేటును అందుకోవడమే తదుపరి లక్ష్యమని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆ గమ్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఐసీయూలో కాంగ్రెస్‌
ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఐసీయూలో ఉందని మోదీ ఎద్దేవా చేశారు. మనుగడ కోసం ఇతర విపక్షాలపై అతిగా ఆధారపడుతోందని హేళన చేశారు. అందుకే 2019 ఎన్నికల కోసం ఎలాగైనా మహాకూటమి ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. నమోయాప్‌ ద్వారా మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలతో ముచ్చటించారు. గాలి బీజేపీ వైపే వీస్తోందని, ఆ బలానికి కొట్టుకుపోకుండా విపక్షాలు ఒకరి చేతులను మరొకరు గట్టిగా పట్టుకుంటున్నాయని పేర్కొన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘మేరా బూత్‌ సబ్సే మజ్‌బూత్‌’(నా పోలింగ్‌ బూత్‌ అత్యంత బలమైనది) మంత్రాన్ని పాటించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని, వారి శ్రమ, కష్టం వల్లే నాలుగేళ్లుగా పార్టీ ఎన్నో చారిత్రక విజయాలు సాధించిందని కొనియాడారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top