‘రాఫెల్‌ వివాదం’లో పారదర్శకత ఎక్కడ? | BJP Response To Rafale Should Be Transparency | Sakshi
Sakshi News home page

‘రాఫెల్‌ వివాదం’లో పారదర్శకత ఎక్కడ?

Sep 25 2018 5:28 PM | Updated on Sep 25 2018 5:39 PM

BJP Response To Rafale Should Be Transparency - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ (పాత ఫొటో)

రాహుల్‌ గాంధీ తన బావైన రాబర్ట్‌ వాద్రాకు ఇప్పించాలని చూస్తున్నారని చేసిన ఆరోపణల్లో ఏమైనా అర్థం ఉందా?

సాక్షి, న్యూఢిల్లీ : ‘గత ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా 126 రాఫెల్‌ యుద్ధ విమానాలకు బదులుగా 36 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగాను, నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరించింది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పోల్చడానికే వీల్లేదు. ఎందుకంటే మా ఎన్డీయే ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు సరళంగా, సజావుగా, వేగంగా ఉండడమే కాకుండా అన్నింటికన్నా పారదర్శకంగా ఉంటాయి’ అని రాఫెల్‌ యుద్ధ విమానాల వివాదంపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ నవంబర్‌ 17, 2017 నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారత భాగస్వామి పార్టీగా అంబానీకి చెందిన రిలయెన్స్‌ డెఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని, రాఫెల్‌ యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీ డాస్సూకు తనకు ఇష్టమైన భాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం ఉన్నప్పటికీ భారత్‌ సూచించిన రిలయెన్స్‌ కంపెనీని ఎంపిక చేయక తప్పలేదని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్‌ హొలాండే చేసిన ఆరోపణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు సూటిగా, పారదర్శకంగా సమాధానం ఇవ్వడం లేదు? రాఫెల్‌ ఒప్పందంపై సంతకం చేసిన హొలాండేనే స్వయంగా ఆరోపణలు చేసినప్పుడు, ఆ ఒప్పందంపై సంతకం చేసిన నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు? ఆయన తరఫున ఆయన మంత్రులు ఒకదానికి ఒకటి పొంతనలేని డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు ఇస్తున్నారు?

రాహుల్‌ గాంధీ, హొలాండే, పాకిస్థాన్‌ను కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాయని, రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందాన్ని రాహుల్‌ గాంధీ తన బావైన రాబర్ట్‌ వాద్రాకు ఇప్పించాలని చూస్తున్నారని సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చేసిన ఆరోపణల్లో ఏమైనా అర్థం ఉందా? రాఫెల్‌ ఒప్పందానికి పాకిస్థాన్‌కు సంబంధం ఏమిటీ? ఆ ఒప్పందంలో రిలయెన్స్‌ డిఫెన్స్‌ కంపెనీ తప్పుకుంటే, ఆ ఒప్పందంలో రాబర్ట్‌ వాద్రా కంపెనీని చేర్చే అవకాశం ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉంటుందనుకుంటే దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తున్న రాహుల్‌ గాంధీ, వాద్రాకు ఎలా ఇప్పించుకుంటారు?

హొలాండే ఆరోపణల బాంబు పేల్చిన దాదాపు 24 గంటల పాటు మౌనం పాటించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ మరుసటి రోజు హొలాండే ఇదే విషయమై మరోసారి చేసిన వ్యాఖ్యల్లో సగ భాగాన్నే తీసుకొనే అర్ధరహితంగా ఎందుకు స్పందించింది? ఆ రెండో భాగాన్నే తీసుకున్న ప్రభుత్వ అనుకూల మీడియాలోని ఓ భాగం మోదీ ప్రభుత్వానిది తప్పులేదని తేల్చగా మిగతా మీడియా ‘ఇది మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌’ అని పేర్కొన్నాయి. ఫ్రాన్స్‌లోని ‘మీడియా పార్ట్‌’ వెబ్‌సైట్‌తో శుక్రవారం హొలాండే మాట్లాడుతూ రిలయెన్స్‌ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రమేయం గురించి వెల్లడించిన విషయం తెల్సిందే. ఆ మరుసటి రోజు ‘ఏజెన్స్‌ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ) ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

‘రాఫెల్‌ ఒప్పందంపై జరిగిన చర్చల్లో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఫార్ములా కింద రిలయెన్స్‌ గ్రూపు పేరును తీసుకొచ్చింది’ అని హొలాండే అన్నారు. డాస్సూతో పనిచేసేందుకు రిలయెన్స్‌ గ్రూప్‌ విషయంలో భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని మీరు భావిస్తున్నారా? అని ఏఏఫ్‌పీ నొక్కి ప్రశ్నించగా ‘అది నా కంతగా తెలియదు. ఈ విషయంలో సమాధానం ఇవ్వగలిగిందీ డాస్సూ కంపెనీయే’ అంటూ హొలాండే వ్యాఖ్యానించారు. మొదటి ప్రశ్నకు మోదీ ప్రభుత్వమే రిలయెన్స్‌ గ్రూప్‌ను తీసుకొచ్చిందంటూ స్పష్టం చేసిన హొలాండే రెండో ప్రశ్నకు కొద్దిగా మార్చి తనకంటే డాస్సూకే ఎక్కువ తెలుసునని చెప్పారు. భారత వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన అలా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే భారత్‌లోని పాలకపక్ష మీడియా రెండో ప్రశ్నకు హొలాండే ఇచ్చిన సమాధానాన్నే ప్రచురించి మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

126 రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం కాస్త 36 విమానాలకే ఎందుకు పరిమితం అయింది? డాస్సూ కంపెనీకి భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వ రంగ సంస్థ ‘హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ కంపెనీ’ స్థానంలో రిలయెన్స్‌ డిఫెన్స్‌ కంపెనీ ఎలా వచ్చింది? 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ కాస్త 51వేల కోట్ల రూపాయలకు ఎందుకు చేరుకుంది? వీటిల్లో ఏ ప్రశ్నకు కూడా మోదీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. ఇక పారదర్శకత ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement